

చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ఉన్నతాధికారులకు భక్తులు, గ్రామస్తుల విజ్ఞప్తి
ఈ69న్యూస్, పర్వతగిరి, మే 24
పర్వతగిరి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నారం షరీఫ్ హజ్రత్ సయ్యద్ యాకుబ్ షావలి బాబా దర్గాలో అక్రమ వసూళ్లు, అవినీతి, నిర్లక్ష్యం పెరిగిపోయాయని గ్రామస్తులు మరియు భక్తులు ఆరోపిస్తున్నారు.దర్గాలో పనిచేస్తున్న సిబ్బంది భక్తులను బెదిరిస్తూ అధిక వసూళ్లకు పాల్పడుతున్నారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.దర్గాలో సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు, వాచ్మెన్లు తదితరంగా మొత్తం 27 మంది సిబ్బంది ఉన్నప్పటికీ, వారిలో కేవలం కొంతమంది మాత్రమే విధులకు హాజరవుతున్నారని, మిగతా వారు డ్యూటీకి రాకపోయినా జీతాలు పొందుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. హాజరు నమోదు వ్యవస్థపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.భక్తులు దర్గాకు తీసుకొచ్చే నైవేద్యాలు, కానుకలు, నగదు, బంగారం వంటి వాటిని హుండీలో వేయకుండా కొంతమంది సిబ్బంది స్వయంగా తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. “వెయ్యి రూపాయలు ఇస్తేనే దర్శనం” అంటూ భక్తులను బలవంతపెడుతున్నారని చెబుతున్నారు. దీనిపై ప్రశ్నించిన గ్రామస్తులను బెదిరింపులకు గురిచేస్తున్నారని సమాచారం.దర్గాలో వివిధ సేవల పేరుతో అధికారిక ఉత్తర్వులు లేకుండానే టికెట్లు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. యాట కందూరు టికెట్ రూ.300, కోడి కందూరు రూ.100, వెంట్రుకల టికెట్ రూ.50, ద్విచక్ర వాహన పూజ టికెట్ రూ.150, త్రిచక్ర వాహనాలకు రూ.200, నాలుగు చక్రాల వాహనాలకు రూ.300, కొబ్బరికాయ టికెట్ రూ.5 వసూలు చేస్తున్నట్లు భక్తులు తెలిపారు.కొబ్బరికాయలు కొట్టే ప్రాంతంలో కూడా అదనపు వసూళ్లు జరుగుతున్నాయని, ఒక్కో కొబ్బరికాయకు రూ.20 వరకు అదనంగా తీసుకుంటున్నారని ఆరోపించారు. ప్రతి శుక్రవారం కొబ్బరి వక్కలను భారీగా తరలిస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు.దర్గాకు సంవత్సరానికి కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నప్పటికీ, భక్తులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఎండాకాలంలో తాగునీరు, టెంట్లు, విశ్రాంతి కోసం కూర్చునే ఏర్పాట్లు లేవని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇటీవల శుక్రవారం భారీ రద్దీ సమయంలో ట్రాఫిక్ నియంత్రణ లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు.గతంలో యూనిఫామ్ ధరించిన సిబ్బంది ట్రాఫిక్ నియంత్రణ చేపట్టేవారని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని పేర్కొన్నారు.దర్గాలో జరుగుతున్న అక్రమాలపై పాలకవర్గం, ప్రజాప్రతినిధులు, సామాజిక సంఘాలు స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. దర్గా సూపరింటెండెంట్, ఇన్స్పెక్టర్ వెంటనే చర్యలు తీసుకుని సిబ్బంది యూనిఫామ్, ఐడీ కార్డులు తప్పనిసరి చేయాలని, హాజరు వ్యవస్థను కట్టుదిట్టం చేయాలని, అక్రమ వసూళ్లను అరికట్టాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.