వర్షాల హెచ్చరికతో అప్రమత్తమైన అధికారులు

ఈ69న్యూస్ బ్యూరో జూన్ 01
రాబోయే రెండు రోజులలో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామాల పరిధిలోని అన్ని ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న వరి ధాన్యాన్ని అత్యవసరంగా మిల్లులకు తరలించాలని సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు.వర్షాల కారణంగా ధాన్యం తడిసి రైతులకు నష్టం కలగకుండా గ్రామాల్లో అందుబాటులో ఉన్న అన్ని ట్రాక్టర్లు మరియు ఇతర రవాణా వాహనాలను వినియోగించి, వచ్చే రెండు రోజులలోపు వడ్లను పూర్తిగా మిల్లులకు తరలించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.అలాగే ఏదైనా మిల్లు ధాన్యాన్ని స్వీకరించడంలో నిరాకరిస్తే లేదా ఇతర సమస్యలు తలెత్తితే వెంటనే జిల్లా కార్యాలయానికి సమాచారం అందించాలని అధికారులు స్పష్టం చేశారు.రైతుల కష్టార్జిత పంటకు నష్టం జరగకుండా ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యతతో తీసుకొని అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు.