త్యాగాలు ఒకరివైతే రాజ భోగాలు మరొకరివా?
జూన్ 2 న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా
సామాజిక తెలంగాణ సాధనకై పోరాడేందుకు ప్రతిన బూనాలి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సుదీర్ఘంగా జరిగిన పోరాటాలలో త్యాగాలు చేసిన వారు ఒకరైతే భోగాలు అనుభవిస్తున్నది మరొకరిని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు అన్నారు. 1969 తొలి దశ ఉద్యమంలో 360 మందికి పైగా ముక్కు పచ్చలారని యువ కిశోరాలు నేల కొరిగారని, మలిదశ ఉద్యమంలో 1200 కు పైగా ప్రాణ త్యాగం చేశారనన్నారు. 1946- 48 వరకు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, దొరల భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటంలో నాలుగు వేలకు మందికి పైగా అమరులైనారని గుర్తు చేశారు. ఆ పోరాటంలో తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య అయితే, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన తొలి దశ పోరాటంలో మార్కండేయ, మలిదశ పోరాటంలో శ్రీకాంత్ చారి, ఈ అన్ని పోరాటాలలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బడుగు బలహీనవర్గాలకు చెందిన వారే ముందు వరసలో ఉన్నారని, త్యాగాలు చేశారని గుర్తు చేశారు. అశేష త్యాగాల ఫలితంగా సాధించిన తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాధికారం అగ్రవర్ణాల చేతిలో బందీ అయిందన్నారు. పోరాటాలలో త్యాగాలలో ముందు వరుసలో ఉన్న బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారం అందని ద్రాక్ష గానే మిగిలిందన్నారు. ఇటీవల కాలంలో జరుగుతున్న బీసీ ఉద్యమాల ఫలితంగా బీసీ వర్గాల్లో రాజకీయ చైతన్యం పెరుగుతున్నదని అందుకు ఇటీవల జరిగిన స్థానిక పంచాయితీ మరియు మున్సిపల్ ఎన్నికల్లో సాధించని ఘన విజయాలే నిదర్శనం అన్నారు. ఆ ఒరవడిని కొనసాగిస్తూ రానున్న కాలంలో బీసీలంతా రాజకీయాల కతీతంగా చట్టసభల్లో రిజర్వేషన్ తో పాటు ఆర్థిక సామాజిక విద్య వైద్య రంగాల్లో మేము ఎంతో మాకు అంత నినాదంతో పోరాడాలని, అంతిమంగా రాజ్యాధికారాన్ని సాధించాలన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన గత ప్రభుత్వం గానీ, ఈనాడున్న ప్రభుత్వం కానీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం లో విఫలమైనాయన్నారు.నిరుద్యోగం అధిక ధరలు అవినీతి విలయతాండవ మాడుతున్నదన్నారు. రైతుల ,కార్మికుల, చేతి వృత్తిదారుల, మహిళల, విద్యార్థి యువకుల అన్ని వర్గాల ప్రజల సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు అమలు పరచకుండ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో జూన్ 2న జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర 13 వ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి ఊరూర,వాడ వాడలో జరిగే కార్యక్రమాలలో ప్రజలంతా పాల్గొని సామాజిక తెలంగాణ సాధన కోసం ప్రతిన బూనాలని వెంకట్రాములు పిలుపునిచ్చారు.