డా.శాంతి కృష్ణ ఆచార్య
డా.శాంతి కృష్ణ ఆచార్య
•విజన్ లేని రాజకీయాలతో రాష్ట్రం బాగుపడదు-గిన్నిస్ రికార్డు గ్రహీత వ్యాఖ్య
తెలుగు గళం న్యూస్ పర్వతగిరి/జూన్ 2
ఎన్నో ప్రాణాలను పణంగా పెట్టి, ఉప్పెనలాంటి ఉద్యమాలు చేసి, సకల జనుల సమైక్యతతో సాధించుకున్న తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది” అని విశ్వ కళావిరాట్, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గ్రహీత, సామాజికవేత్త డా. శాంతి కృష్ణ ఆచార్య అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన మాట్లాడుతూ, విజన్ లేని రాజకీయాలతో రాష్ట్రం బాగుపడదు. రాష్ట్రం ఏర్పడి పుష్కరకాలం పూర్తయినా నిరుపేదలు ఇంకా పేదరికంలోనే మగ్గుతున్నారు. ప్రతిష్టాత్మకమైన ప్రణాళికలు లేని రాజకీయాలు యధావిధిగా కొనసాగుతున్నాయి. పాలకులు స్వచ్ఛమైన పాలన అందించిన నాడే పేదరిక నిర్మూలన జరిగి రాష్ట్రం పురోగతి సాధిస్తుంది. అప్పుడే అమరవీరుల త్యాగానికి నిజమైన ఫలితం దక్కుతుంది” అని అన్నారు.
యుగయుగాలుగా అనేక రాజ్యాలలో కళాకారులకు సముచిత గౌరవం దక్కింది.నాటి రాజులు కళాకారులను ప్రోత్సహించి, కళా ప్రదర్శనల ద్వారా ప్రజలను చైతన్యపరిచారు. కానీ నేడు తెలంగాణ ఆవిర్భావం కోసం నిర్విరామ కృషి చేసిన కళాకారులను సంపూర్ణంగా ప్రోత్సహించే ప్రభుత్వాలు కరువవుతున్నాయి.అని ఆవేదన వ్యక్తం చేశారు.ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారిని గుర్తించి ప్రోత్సహించే సాంప్రదాయాన్ని ప్రభుత్వాలు మర్చిపోయాయి. ప్రోత్సాహం అందినప్పుడే అసాధ్యాలు సుసాధ్యాలై అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తారు” అని డా.ఆచార్య తెలిపారు. పాలకులు ఎవరైనా ప్రజలకు అందుబాటులో ఉండాలి. వారి జీవన విధానంలో భాగస్వాములై, అండగా నిలిచి మనోధైర్యం ఇచ్చినప్పుడు ప్రజలు రెట్టింపు ఉత్సాహంతో అభివృద్ధి సాధిస్తారు. అప్పుడు రాష్ట్రం సస్యశ్యామలమై, అన్ని రంగాల్లో నిష్ణాతులై దేశానికి ఆదర్శంగా నిలవడమే కాక విశ్వశాంతి సాధనలో పరిపూర్ణ భాగస్వాములమవుతాం”అని అభిప్రాయపడ్డారు.