రేగొండలో అధికారుల సమన్వయ సమావేశం
రేగొండలో అధికారుల సమన్వయ సమావేశం
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి రేగొండ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఇసుక రవాణాను క్రమబద్ధీకరించడానికి,వినియోగదారులకు ఇసుక దోపిడీ లేకుండా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం నూతన నిబంధనలను,మండలాల వారీగా అధికారిక ధరలను ఖరారు చేసింది.ఈ నూతన ఉత్తర్వుల అమలుపై మంగళవారం రేగొండ మండల కేంద్రంలో స్థానిక రెవెన్యూ, పోలీస్, మోటార్ వాహనాల తనిఖీ శాఖ,పంచాయతీ రాజ్ అధికారుల సంయుక్త సమన్వయ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో రేగొండ తహశీల్దార్ శ్వేతా రావు,సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) దాసరి సుధాకర్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ) సుందర్ నాయక్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొని నూతన నిబంధనల పోస్టర్లను విడుదల చేశారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని మండలాలకు వర్తించేలా రూపొందించిన ఈ నూతన విధానం ప్రకారం ఇకపై పాత ఇందిరమ్మ కూపన్ల స్థానంలో సరికొత్త నమోదు ప్రక్రియను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.ఇసుక రవాణా చేయాలనుకునే ట్రాక్టర్ యజమానులు తప్పనిసరిగా స్థానిక తహశీల్దార్ (ఎమ్మార్వో) కార్యాలయంలో తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.ఈ నమోదు ప్రక్రియ కోసం వాహన యజమానులు తమ ట్రాక్టర్ ఇంజన్ నంబరు, ట్రాలీ నంబరు, వాహన బీమా (ఇన్సూరెన్స్) పత్రాలు,డ్రైవర్ యొక్క చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ పత్రాలను తహశీల్దార్ కార్యాలయంలో సమర్పించి ముందస్తు అనుమతి పొందాలని సూచించారు.ఈ నూతన విధానంలో రవాణా పరిమితులు,సమయ పాలనపై కట్టుదిట్టమైన ఆంక్షలను విధించారు.అనుమతి పొందిన వాహనాలు కేవలం భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలో మాత్రమే ఇసుక రవాణా చేయడానికి అర్హత కలిగి ఉంటాయని,నియోజకవర్గ సరిహద్దులు దాటి రవాణా చేయడానికి వీలులేదని అధికారులు తేల్చి చెప్పారు.అలాగే ప్రతిరోజూ ఉదయం 6:00 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు మాత్రమే ఇసుక రవాణాకు అనుమతి ఉంటుందని,రాత్రి వేళల్లో రవాణాను పూర్తిగా నిషేధించామన్నారు.ప్రభుత్వ అధికారిక సెలవు రోజుల్లో కూడా జిల్లా వ్యాప్తంగా ఇసుక రవాణాను పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించారు.రైతులు, సామాన్య ప్రజల సౌకర్యార్థం ఒక ట్రాక్టర్ ఇసుకకు మండలాల దూరాన్ని బట్టి ప్రభుత్వం గరిష్ట ధరలను నిర్ణయించింది.దీని ప్రకారం గోరికొత్తపల్లి మండల పరిధిలోని గ్రామాలకు ఒక ట్రాక్టర్ ఇసుక ధరను 4,000 రూపాయలుగా నిర్ణయించారు. అలాగే రేగొండ,భూపాలపల్లి, ఘనపూర్ మండలాల పరిధిలోని ప్రాంతాలకు 3,500 రూపాయలుగా,చిట్యాల మండల పరిధిలోని గ్రామాలకు 2,200 రూపాయలుగా టేకుమట్ల, మొగుళ్ళపల్లి మండలాల పరిధిలోని ఇళ్లకు ఒక ట్రాక్టర్ ఇసుక ధరను 2,000 రూపాయలుగా ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేసింది.ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం మరియు రక్షకభట శాఖ సంయుక్తంగా వాహనదారులకు,దళారులకు గట్టి హెచ్చరికలు జారీ చేశాయి.ప్రభుత్వం అధికారికంగా నిర్ణయించిన ధరల కంటే ఎవరైనా అదనంగా ఒక్క రూపాయి వసూలు చేసినా, లేదా సరైన అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడినా అలాంటి వాహనాలను తక్షణమే సీజ్ చేస్తామని ఎస్ఐ సుధాకర్, ఏఎంవీఐ సుందర్ నాయక్ హెచ్చరించారు.అంతేకాకుండా బాధ్యులైన వారిపై చట్టపరంగా కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు.ఎవరైనా నిర్దేశిత ధరల కంటే ఎక్కువ డిమాండ్ చేస్తే సామాన్య ప్రజలు భయపడకుండా వెంటనే స్థానిక పోలీసులకు లేదా రెవెన్యూ అధికారులకు సమాచారం అందించాలని తహశీల్దార్ శ్వేతా రావు, ఎంపీడీవో వెంకటేశ్వర రావు విజ్ఞప్తి చేశారు.జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడానికి, పారదర్శక విధానాన్ని అమలు చేయడానికి ప్రజలు,వాహనదారులు ప్రభుత్వ ఆదేశాలను తప్పనిసరిగా పాటించి పూర్తి స్థాయిలో సహకరించాలని పత్రికా ముఖంగా అధికారులు కోరారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల సిబ్బంది, ట్రాక్టర్ యజమానులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.