కలెక్టరేట్ ను ముట్టడించిన బాధితులు,సీపీఎం నేతలు
కలెక్టరేట్ ను ముట్టడించిన బాధితులు,సీపీఎం నేతలు
తెలుగు గళం న్యూస్ హనుమకొండ
హనుమకొండ జిల్లా గోపాల్పూర్ పరిధిలో పేద ప్రజలు నిర్మించుకుని నివాసముంటున్న ఇండ్లను,గుడిసెలను జిల్లా అధికార యంత్రాంగం ముందస్తు సమాచారం లేకుండా నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.ఇండ్ల కూల్చివేతకు నిరసనగా సోమవారం బాధితులు, సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు భారీ ధర్నా, నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కమిటీ నాయకులు మాట్లాడుతూ.. దశాబ్దాలుగా నిలువ నీడ లేక, రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలు గోపాల్పూర్ ప్రాంతంలో చిన్న చిన్న ఇండ్లు, గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారని తెలిపారు. అలాంటి పేదలకు ప్రత్యామ్నాయ వసతి కల్పించకుండా, మానవత్వం లేకుండా జిల్లా యంత్రాంగం జేసీబీలతో ఇండ్లను కూల్చివేసి వారిని రోడ్డున పడేయడం అత్యంత దారుణమని మండిపడ్డారు. వర్షాకాలం ప్రారంభమవుతున్న తరుణంలో తలదాచుకునేందుకు నీడ లేక చిన్న పిల్లలు, వృద్ధులతో పేద ప్రజలు నడిరోడ్డుపై అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినా పేదల బతుకులు మారడం లేదని, ‘ప్రజా పాలన’ అని చెప్పుకుంటున్న ప్రభుత్వం పేదల పొట్టకొట్టడం సరికాదని ధ్వజమెత్తారు.కూల్చివేతలతో సర్వస్వం కోల్పోయిన బాధితులందరికీ ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని, గతంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను గానీ, లేదా నూతనంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇండ్లను గానీ కేటాయించి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్కు సమర్పించారు. పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చి, ఇండ్లు నిర్మించి ఇచ్చేంతవరకు సీపీఎం ఆధ్వర్యంలో బాధితులతో కలిసి పోరాటాన్ని ఉధృతం చేస్తామని,అవసరమైతే కలెక్టరేట్ ముందే వంటావార్పు చేసి నిరసన తెలుపుతామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో సీపీఎం మండల ముఖ్య నాయకులు రమేష్, సబిత, సమ్మయ్య, మమత, శృతి, పావని, యాకమ్మలతో పాటు కూల్చివేత బాధితులు, మహిళలు,పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని జిల్లా యంత్రాంగం వైఖరికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు.