ఏపీ లో మా బిడ్డలు డెలివరీ అయితే టీజీ లో డబ్బులు ఇవ్వరా?
ఖమ్మంజిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు,కల్లూరు మండలాలకు చెందిన భవన నిర్మాణ కార్మికులు సీఐటీయూ అనుబంధ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు మల్లూరు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు దగ్గరలో గల టంగుటూరి అంజయ్య కార్మిక సంక్షేమ భవనం(తెలంగాణ రాష్ట్ర లేబర్ కమిషనర్ కార్యాలయం) లో అదనపు కమిషనర్ ఈ.గంగాధర్,
వెంకటరెడ్డి లను కలసి కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై వివరించారు.వివరాల్లోకి వెళితే గత నెల రోజుల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆసుపత్రులలో డెలివరీ అయిన తెలంగాణా భవన నిర్మాణ కార్మికుల కుమార్తెలకు,భార్యలకు తెలంగాణా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమబోర్డు ఇచ్చే ముప్పయి వేల రూపాయల ఆర్థికసాయంకు మీసేవ కేంద్రాలలో దరఖాస్తులు ఆన్లైన్ కావడం లేదని,ఏపీ లో డెలివరీ అయితే టీజీ లో డబ్బులు ఇవ్వరా అని ప్రశ్నిస్తు వినతిపత్రాలు ఇచ్చారు.వెంటనే సర్వర్ లో మార్పులు చేసి ఏ రాష్ట్రoలో డెలివరీ లు అయినా ఆన్లైన్ చేసుకునేలా అవకాశం ఇచ్చి పాత పద్ధతిలోకి మార్చి న్యాయం చేయాలని పేర్కొన్నారు.అంతే కాకుండా సి ఎస్ సి హెల్త్ టెస్టుల లీజు రద్దు చేసి కార్మికులకు నేరుగా వైద్య పరీక్షల కోసం ఆర్థిక సాయం అందించాలని,కార్మికుల పిల్లలకు చదువుల కోసం స్కాలర్షిప్పులు ఇవ్వాలని,కార్మికుని స్వంత గృహ నిర్మాణానికి బోర్డ్ నుండి ఐదు లక్షల రూపాయలు వరకు ఇవ్వాలని,55 ఏళ్ళు నిండిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు ఆరువేల రూపాయల చొప్పున పెన్షన్ ఇవ్వాలని,కార్మిక సంఘాల నాయకులతో బోర్డు అడ్వైజరీ కమిటి ఏర్పాటు చేయాలని,సహజ మరణానికి ఇచ్చే రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ఐదు లక్షలకు పెంచాలని,ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థలకు అవకాశం లేకుండా అన్ని పథకాలను నేరుగా ప్రభుత్వమే బోర్డు ద్వారా అందించాలని,ప్రసూతి,వివాహా సమయంలో ఇచ్చే ముప్పయి వేల సాయాన్ని లక్ష రూపాయలకు పెంచాలని కోరారు.ఈ కార్యక్రమంలో: వేంసూరు మండల పరిధిలోని వెంకటాపురం గ్రామ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు షేక్ బాజీ,మండల మహిళా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకురాలు పర్సా సరోజిని, చిన్నమల్లేల గ్రామ నాయకులు పుచ్చకాయల వెంకటేశ్వరరావు,కల్లూరు మండల బాధ్యులు ఇనపనూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.