రూ.2 కోట్లతో ఆధునిక బహిరంగ క్రీడా ప్రాంగణం
సత్తుపల్లి పట్టణంలోని జేవీఆర్ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో సుమారు రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆధునిక బహిరంగ క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు బుధవారం స్థల పరిశీలన చేపట్టారు. సత్తుపల్లి శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్, జిల్లా క్రీడల అధికారి సునీల్ రెడ్డితో కలిసి ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు.
బహిరంగ క్రీడా ప్రాంగణం నిర్మాణానికి సంబంధించి అధికారులు స్థల కొలతలు చేపట్టగా, ప్రాంగణ నిర్మాణంలో క్రీడాకారులకు ఉపయోగపడేలా అన్ని సౌకర్యాలు కల్పించాలని శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి, డాక్టర్ మట్టా దయానంద్ పలు సూచనలు చేశారు.
అనంతరం జేవీఆర్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని వ్యాయామ పరికరాలను పరిశీలించిన వారు, పనిచేయని పరికరాలను వెంటనే మరమ్మతులు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. సత్తుపల్లి పట్టణంలో అత్యాధునిక సౌకర్యాలతో బహిరంగ క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి యువతకు, క్రీడాకారులకు మరింత ఉపయోగపడేలా అభివృద్ధి చేస్తామని తెలిపారు.