నీట్ రీ-ఎగ్జామ్,అక్రమ అరెస్టులకు నిరసన
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజా, విద్యార్థి వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం భారీ ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. టేకుమట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ మాట్లాడుతూ… ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం పోలీసులతో లాఠీఛార్జ్ చేయించడం, బాష్పవాయువు ప్రయోగించడం అత్యంత దారుణమని తీవ్రంగా మండిపడ్డారు. విద్యార్థులకు మద్దతుగా నిలిచిన ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు ఇతర విపక్ష నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని టేకుమట్ల కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దేశంలో కోట్ల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ ‘నీట్’ పరీక్షల్లో జరిగిన భారీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే జంతర్ మంతర్ వద్ద పోరాడుతున్న విద్యార్థులపై అక్రమ కేసులు బనాయించినందుకు గాను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా తక్షణమే రాజీనామా చేయాలని స్పష్టం చేశారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కులను కాలరాస్తోందని సతీష్ గౌడ్ ఆరోపించారు.విద్యార్థులు,కాంగ్రెస్ నాయకులపై అణచివేత ధోరణిని వీడకపోతే రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా, మండల నాయకులు, యువజన కాంగ్రెస్ ప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.