భూపాలపల్లిలో రూ.1.96 లక్షల విలువైన నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులు స్వాధీనం
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిషేధిత పొగాకు ఉత్పత్తులను అక్రమంగా నిల్వ ఉంచి విక్రయిస్తున్న వ్యాపారులపై సీసీఎస్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.ఈ తనిఖీల్లో సుమారు రూ.1,96,430 విలువైన గుట్కా మరియు పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశాల మేరకు భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.ఈ క్రమంలో గురువారం సీసీఎస్ పోలీసులు భూపాలపల్లి పట్టణంలోని చాముండా జనరల్ స్టోర్స్, దుర్గా జనరల్ స్టోర్స్, పవన్ కృష్ణ కిరాణా దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.ఈ దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన అంబర్, ఆర్ఆర్, అనార్, జేకే, మీరాజ్ తదితర నిషేధిత పొగాకు ఉత్పత్తులను గుర్తించి సీజ్ చేశారు.స్వాధీనం చేసుకున్న సరుకును తదుపరి చట్టపరమైన చర్యల కోసం భూపాలపల్లి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ కి అప్పగించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మాట్లాడుతూ… ప్రజారోగ్యానికి తీవ్ర హాని కలిగించే నిషేధిత పొగాకు ఉత్పత్తులను రవాణా చేసినా, నిల్వ ఉంచినా లేదా విక్రయించినా వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తీవ్రంగా హెచ్చరించారు.జిల్లాలో ఇటువంటి అక్రమ కార్యకలాపాలు ఎక్కడైనా జరుగుతుంటే ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని కోరారు.