oplus_2162704

చెట్ల కిందే జ్యూస్, పానీపూరీ, పండ్ల బండ్లు.. గుంపులుగా జనం.. ప్రమాదం జరిగితే భారీ ప్రాణనష్టం తప్పదంటున్న స్థానికులు

ఈ69న్యూస్ వరంగల్, సెప్టెంబర్ 17

వరంగల్-ఖమ్మం రోడ్డు నాయుడు పెట్రోల్ పంప్ సమీపంలో రహదారి వైపు ప్రమాదకరంగా వంగి ఉన్న భారీ వృక్షాలను వెంటనే తొలగించాలని స్థానికులు, వాహనదారులు సంబంధిత అధికారులను కోరుతున్నారు. ఈ భారీ చెట్ల కిందనే జ్యూస్ బండ్లు, పానీపూరీ బండ్లు, పండ్ల బండ్లు ఏర్పాటు చేయడంతో పాటు చేపల విక్రయాలు కూడా జరుగుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో ప్రజలు గుంపులు గుంపులుగా చేరుతున్నారు. ఈ పరిస్థితుల్లో భారీ వృక్షాలు ఒక్కసారిగా కూలితే పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రమాదానికి గురై భారీ ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇటీవల హనుమకొండ పబ్లిక్ గార్డెన్స్ సమీపంలో భారీ వృక్షం ఆర్టీసీ బస్సుపై కూలిన ఘటన ప్రజల్లో భయాందోళన కలిగించింది. బస్సు, ఆటోలు రాకపోకలు సాగిస్తున్న సమయంలో చెట్టు కూలడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన నేపథ్యంలో ప్రధాన రహదారులు, హైవేల వెంట ప్రమాదకరంగా ఉన్న చెట్లను ముందుగానే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.మరోవైపు నాయుడు పెట్రోల్ పంప్ సమీపంలో డివైడర్ ఏర్పాటు చేయడంతో ఇప్పటికే రహదారి ఇరుకుగా మారిందని వాహనదారులు, బాటసారులు చెబుతున్నారు. దీనికి తోడు రహదారి పక్కన ఏర్పాటు చేసిన చిరు వ్యాపారాల కారణంగా ప్రజలు, వాహనాలు ఒకే ప్రాంతంలో ఎక్కువగా చేరుతుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని అంటున్నారు.ఇరుకైన రహదారిపై వాహనాలు, పాదచారులు ఇబ్బందులు పడటంతోపాటు తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.ప్రమాదం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే ముందుగానే ప్రమాదాలను గుర్తించి నివారించాలని ప్రజలు కోరుతున్నారు. నాయుడు పెట్రోల్ పంప్ పరిసరాల్లోని ప్రమాదకర చెట్లను అధికారులు తక్షణమే పరిశీలించి, అవసరమైన చెట్లను తొలగించాలని, రహదారి ఆక్రమణలు మరియు రోడ్డు పక్కన ఉన్న చిరు వ్యాపారాల వల్ల ఏర్పడుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా రహదారిని సురక్షితంగా, విశాలంగా మార్చేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *