భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు!
- దసరా తర్వాత రెండో ఆదివారం.. ఘనంగా శ్రీ ఎర్రమ్మ తల్లికి మొక్కుల సమర్పణ!
- భక్తుల కొంగుబంగారంగా శ్రీ ఎర్రమ్మ తల్లి.. ఆలయంలో ఆధ్యాత్మిక సందడి!
తెలుగు గళం ఏటూరునాగారం, నవంబర్ 01 :
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని శ్రీ ఎర్రమ్మ తల్లి ఆలయం వద్ద ఆదివారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి ఘనంగా మొక్కులు సమర్పించారు. ప్రతి సంవత్సరం దసరా పండుగ అనంతరం వచ్చే రెండో ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. 2009 సంవత్సరం నుంచి స్థానిక భక్తులు, గ్రామ ప్రజల సహకారంతో ఈ సంప్రదాయం నిరంతరాయంగా కొనసాగుతోందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. గతంలో ఈ ప్రాంతంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో గ్రామ ప్రజలు, భక్తులు కలిసి కమిటీగా ఏర్పడి శ్రీ ఎర్రమ్మ తల్లి ఆశీస్సులు పొందేందుకు ప్రత్యేక మొక్కుల కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు వివరించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దసరా అనంతరం రెండో ఆదివారం భక్తులంతా ఆలయానికి చేరుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ మొక్కులు సమర్పిస్తున్నారు. ఈ ఏడాది కూడా మహిళలు, పురుషులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని కొబ్బరికాయలు, పూలు, పండ్లు తదితర నైవేద్యాలను సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు ముఖ్య అతిథిగా హాజరై శ్రీ ఎర్రమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి తన వంతుగా కానుకను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు వంగూరి నాగేశ్వరరావు, అర్చకులు సూర్యనారాయణ, వలస శ్రీనివాస్, గుర్రపు రంగయ్య, చెన్న తిరుపతి, కర్ర రవీందర్, వార్డు సభ్యులు నాగరాజు, నల్లెబోయిన కోటయ్య తదితరులు పాల్గొన్నారు.
