ఆదాయ మార్గాల అభివృద్ధికి కృషి చేయాలి
గ్రామాలు, పట్టణాల్లో స్థానిక ఆదాయ మార్గాలను పెంచుకుని సమగ్ర అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని శ్రీనివాస ఫంక్షన్ హాలులో సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లకు 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై నిర్వహించిన ఒక రోజు శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఆయన పాల్గొన్నారు. కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించి అనంతరం రాష్ట్ర గీతాన్ని ఆలపించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాల్లో విరిగిన లేదా వంగిన విద్యుత్తు పోల్స్, ప్రమాదకరంగా ఉన్న విద్యుత్తు వైర్లు, ముఖ్యంగా ఇండ్లపై నుంచి వెళ్తున్న 11 కేవీ విద్యుత్తు లైన్లను గుర్తించి వెంటనే తొలగించే చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే దెబ్బతిన్న విద్యుత్తు స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.ప్రభుత్వం రూపొందించిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పంచాయతీలు, మున్సిపాలిటీలు పారిశుద్ధ్య కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించి గ్రామాలు, పట్టణాలను పరిశుభ్రంగా మార్చాలని అన్నారు. చెత్తను తొలగించడం, మురుగు కాల్వలను శుభ్రం చేయడం వంటి కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వామ్యం చేయాలని సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో కోతులు, కుక్కల సమస్యను తగ్గించేందుకు స్థానిక వనరుల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుని పరిష్కార చర్యలు చేపట్టాలని తెలిపారు.అలాగే ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, 14 నుండి 15 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలకు గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణ కోసం హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయించే కార్యక్రమాన్ని అమలు చేయాలని సూచించారు. జిల్లాలో ఇప్పటికే 2,425 మంది బాలికలను గుర్తించామని, వారికి అవగాహన కల్పించి తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.అదేవిధంగా మహిళా సంఘాలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లు చెప్పారు.జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు వివిధ శాఖలు చేపట్టాల్సిన కార్యక్రమాల షెడ్యూల్‌ను వివరించారు.గ్రామాలు, మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి జాబితాను తయారు చేసి ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ఈ నెల 3న రాష్ట్ర ముఖ్యమంత్రి 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించి తగు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.సర్పంచులు, మున్సిపల్ చైర్మన్లు ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా నిర్వహించి గ్రామాలు, పట్టణాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అన్ని గ్రామాల సర్పంచులు, మున్సిపల్ చైర్మన్లకు 99 రోజుల కార్యక్రమానికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ అందజేసినట్లు తెలిపారు.అనంతరం పంచాయతీ, మున్సిపల్, వైద్య, పోలీస్, రవాణా, సంక్షేమ, వ్యవసాయ, ఎక్సైజ్, విద్య, యువజన సర్వీసులు–క్రీడలు, అటవీ శాఖల అధికారులు తమ శాఖల ద్వారా అమలు చేయనున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి నవీన్ రెడ్డి, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఆర్డీవో హరికృష్ణ, ఏఎస్పీ నరేష్ కుమార్, మున్సిపల్ చైర్మన్ బుర్రా కొమురయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు