ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇసుక మాఫియా దందా
హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని పలు గ్రామ పంచాయతీల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పేరుతో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్టు తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పేదల గృహ నిర్మాణ పథకాన్ని అడ్డం పెట్టుకుని ఇసుక మాఫియా దందా కొనసాగుతున్నదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గ్రామ పంచాయతీ రికార్డుల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకగా నమోదు చేసి, ఆ అనుమతులను ఉపయోగించి సమీప వాగులు, నదుల నుంచి భారీగా ఇసుక తవ్వకం జరుపుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ఇసుక నిజంగా లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణానికి వినియోగించకుండా, ప్రైవేట్‌గా అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఒక ట్రిప్పు ఇసుకను సుమారు రూ.5,000కు అమ్ముతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ట్రాక్టర్ల ద్వారా పగలు, రాత్రి తేడా లేకుండా ఇసుక రవాణా కొనసాగుతోంది.ఇక నిజమైన లబ్ధిదారులకు ఇసుక అందకపోవడంతో గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు నిలిచిపోయాయి. పథకం అమలు లక్ష్యం దెబ్బతింటోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమాలు అధికారుల సహకారం లేకుండా సాధ్యం కాదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని గ్రామాల్లో ఫిర్యాదులు చేసినప్పటికీ చర్యలు తీసుకోవడంలో ఆలస్యం జరుగుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు.ఇసుక అక్రమ తవ్వకాల వల్ల పర్యావరణానికి కూడా తీవ్ర నష్టం వాటిల్లుతోంది.నదీ తీరాలు దెబ్బతినడం, భూగర్భ జలాల స్థాయి పడిపోవడం, భవిష్యత్తులో వ్యవసాయంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఈ నేపథ్యంలో అక్రమ ఇసుక తవ్వకాలపై వెంటనే సమగ్ర దర్యాప్తు చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.అలాగే నిజమైన లబ్ధిదారులకు పారదర్శకంగా ఇసుక సరఫరా జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు