ఈ నెల 20లోగా ఓటర్ల సమగ్ర సవరణ పూర్తి చేయాలి
జిల్లాలో ఈ నెల 20వ తేదీ లోగా ఓటర్ల సమగ్ర సవరణ ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు.మంగళవారం గణపురం మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ఓటర్ల నమోదు ప్రక్రియను కలెక్టర్ క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు.ఇందులో భాగంగా 306వ నంబర్ పోలింగ్ కేంద్రం పరిధిలో బూత్ స్థాయి అధికారి (బీఎల్ఓ) గీత నిర్వహిస్తున్న నమోదు కార్యక్రమాన్ని తనిఖీ చేశారు.రోజువారీ నమోదు వివరాలు, పెండింగ్లో ఉన్న దరఖాస్తుల స్థితిగతులను అడిగి తెలుసుకున్న కలెక్టర్.. మిగిలిన ప్రక్రియను రానున్న ఐదు రోజుల్లోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్క అర్హుడికి ఓటు హక్కు కల్పించడమే ఈ ఓటర్ల సవరణ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు.కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన అధికారిక యాప్ ద్వారా ప్రజలు సులభంగా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు.ఓటరు ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి చేయడంలో ఎలాంటి సందేహాలు ఉన్నా స్థానిక బీఎల్ఓల సహాయం పొందవచ్చని స్పష్టం చేశారు.ఓటరు జాబితాలో వంద శాతం పారదర్శకతను పెంపొందించడం కోసం.. ఇప్పటికే మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లను నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించి జాబితా నుండి తొలగించనున్నట్లు వెల్లడించారు.ఓటర్ల జాబితా సవరణ అనేది అత్యంత బాధ్యతాయుతమైన ప్రక్రియ అని, నిర్దేశిత గడువులోగా లక్ష్యాన్ని చేరుకోవడానికి రెవెన్యూ అధికారులు, సిబ్బంది పరస్పర సమన్వయంతో కట్టుబడి పనిచేయాలని ఆదేశించారు.ఈ క్షేత్రస్థాయి తనిఖీ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, పశుసంవర్ధక శాఖ డీడీ డాక్టర్ కుమారస్వామి, జిల్లా వ్యవసాయ అధికారి బాబూరావు,గణపురం తహసీల్దార్ రాజేశ్వరరావు,ఎంపీడీఓ భాస్కర్,బీఎల్ఓలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.