కాంగ్రెస్ నేతలే సొంత ప్రభుత్వాన్ని నిలదీత
వర్ధన్నపేట మున్సిపల్ పట్టణ కేంద్రంలోని 11వ డివిజన్లో 99 రోజుల ‘పట్టణ ప్రగతి-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం వార్డు సభ నిర్వహించారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ సిలివేరు కుమారస్వామి యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో కాంగ్రెస్ నాయకులే సొంత ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం చర్చనీయాంశమైంది.మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీకి చెందినప్పటికీ, వార్డు ప్రజలతో పాటు స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు, ఇతర డివిజన్ల కాంగ్రెస్ నాయకులు సైతం సైడ్ కాలువలను శుభ్రం చేయడం లేదని, వార్డులో చెత్త బండి రావడం లేదని, నల్లా నీళ్లు సరిగా రావడం లేదని మున్సిపల్ అధికారులను నిలదీశారు. ఒక రకంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్నే కాంగ్రెస్ పార్టీ నాయకులే ప్రశ్నించడం గమనార్హం.వర్షాకాలంలో జాగ్రత్తలు: కౌన్సిలర్ కుమారస్వామి
ఈ సందర్భంగా కౌన్సిలర్ సిలివేరు కుమారస్వామి యాదవ్ మాట్లాడుతూ, రానున్న వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా ప్రతి ఇంటి ముందు చెత్త చెదారం, మురుగు నీరు లేకుండా చూసుకోవాలని సూచించారు. డివిజన్లో ఏదైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని, రాబోయే జనరల్ బాడీ సమావేశంలో వాటిని ప్రస్తావించి పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్లపై అధికారుల వివరణ మున్సిపల్ అధికారులు మాట్లాడుతూ, ఇంకా కొత్త పెన్షన్లు మంజూరు కాలేదని, 2వ విడత ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం రాలేదని తెలిపారు. సమాచారం వచ్చిన వెంటనే అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో వార్డు ఇన్చార్జి ఆఫీసర్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ కర్ణాకర్, వార్డు ఆఫీసర్ రితేష్ కుమార్, బిల్ కలెక్టర్ తుమ్మల విజయ్ కుమార్, వీఓ విజయ, ఆశా వర్కర్ స్రవంతి, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.