కుల రహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాలు
మహాత్మ జ్యోతిబా పూలే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతుల సందర్భంగా కులరహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాలను విజయవంతం చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున పిలుపునిచ్చారు. ఈనెల 28న నల్లగొండలో ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.మిర్యాలగూడ పట్టణంలోని కందుకూరి కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..మహనీయుల ఆశయాలను కొనసాగించడానికి భావితరాలకు సామాజిక వివక్ష, అన్యాయాలు, దళితుల సంక్షేమం మరియు అభివృద్ధి అంశాలపై సమగ్ర చర్చలు జరగాల్సిన అవసరం ఉందన్నారు.నేటికీ కుల వివక్ష తీవ్రమైన రూపం దాలుస్తోందని, కులం–మతం పేరుతో సమాజంలో విభజనలు సృష్టించే కుట్రలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులపై దాడులు, కులదురహంకార హత్యలు, కులాంతర వివాహాలపై దాడులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. సమాన అవకాశాలు దళితులకు అందకుండా అడ్డంకులు సృష్టించే పరిస్థితులు బహిరంగంగా కనిపిస్తున్నాయని తెలిపారు.ఈ నేపథ్యంలో పూలే–అంబేడ్కర్ జనజాతర ద్వారా కులరహిత సమానత్వం కోసం సామాజిక సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, సామాజిక సంస్థలు, ప్రజా సంఘాలు, ప్రజాతంత్రవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీను, రాష్ట్ర కమిటీ సభ్యులు రెమిడాల పరుష రాములు, జిల్లా సహాయ కార్యదర్శి దైద శ్రీను, ఉపాధ్యక్షులు కోడిరెక్క మల్లయ్య, జిల్లా కమిటీ సభ్యులు దోరేపల్లి మల్లయ్య, యేసు, నల్ల రామస్వామి, బొంగరల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.