గరికపాటి పై తక్షణ చర్యలు తీసుకోవాలి
గరికపాటి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రవచనాకారుడు గరికపాటి నరసరావు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ నగర కేంద్రంలోని నిర్మల హృదయ పాఠశాల వద్ద నుండి నూతన మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కోడిగుడ్లతో నిరసన తెలిపి గరికపాటి నరసింహారావు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ప్రవీణ్ మాట్లాడుతూ
పేద విద్యార్థుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా, ప్రభుత్వ పాఠశాలలపై అపనిందలు మోపుతూ వ్యాఖ్యలు చేసిన గరికపాటి నరసింహారావు పై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ప్రవచనాల పేరుతో పిల్లలపై అసభ్యంగా, అవమానకరంగా మాట్లాడిన గరికపాటి వ్యాఖ్యలు పూర్తిగా అమానవీయమైనవని, ముఖ్యంగా విద్యార్థులను “శోభనం పెళ్లికొడుకు”తో పోల్చడం అనేది విద్యార్థి లోకాన్ని అవమానించడమేనని తెలిపారు. పేద పిల్లలు కేవలం కోడిగుడ్డు కోసమే బడికి వస్తున్నారని చెప్పడం వారి పేదరికాన్ని ఎగతాళి చేయడమేనని విమర్శించారు. దేశవ్యాప్తంగా అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం విద్యార్థుల హాజరు పెరగడానికి, డ్రాపౌట్ తగ్గించడానికి, పౌష్టికాహార లోపాన్ని తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తున్నదని అనేక అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. స్వయంగా సుప్రీంకోర్టు కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అలాంటి పథకాన్ని అవహేళన చేస్తూ మాట్లాడటం గరికపాటి అజ్ఞానాన్ని, బాధ్యతారాహిత్యాన్ని బయటపెడుతుందని అన్నారు. దేశంలో సుమారు 84% మంది తల్లులు, పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న సమయంలో, విద్యార్థులకు అందించే గుడ్డును “గాడిద గుడ్డు”గా వ్యాఖ్యానించడం ఆకలిని, పేదరికాన్ని కించపరచడమేనని తీవ్రంగా ఖండించారు. విద్యార్థులకు ఉచిత భోజనం, పుస్తకాలు, యూనిఫాంలు అందించడం ప్రభుత్వం యొక్క బాధ్యత అని, దానిని “బిచ్చం”గా అభివర్ణించడం సిగ్గుచేటని విమర్శించారు. కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చే లక్షల కోట్ల రాయితీలపై ఎప్పుడూ స్పందించని గరికపాటి, పేద పిల్లలకు అందించే భోజనంపై విషం కక్కడం దుర్మార్గమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వంకాయల.రాజు ఖమ్మం డివిజన్ అధ్యక్షులు త్రినాథ్ జిల్లా కమిటీ సభ్యులు సుశాంత్ నాయకులు లోకేష్, లోహిత్ కుమార్,అశోక్,భరత్, సాయి, కీర్తన, సంజన,సిరి,అభినయ,శశి, వికిత,సుష్మా శ్రీ,కావేరి,మమత, సమత, మంజునాథ్,రాజేష్,ప్రశాంత్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.