డీ-లిమిటేషన్ పేరుతో మహిళా బిల్లు
హనుమకొండ డీసీసీ భవన్లో కుడా చైర్మన్, హనుమకొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, టీపీసీసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణలతో కలిసి వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే,విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ, డీ-లిమిటేషన్ పేరుతో మహిళా బిల్లును కలిపి కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ నాటకం ఆడారని తీవ్రంగా విమర్శించారు. దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను కచ్చితంగా అమలు చేశాయని, అదే కారణంగా ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే జనాభా తక్కువగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాబల్యాన్ని తగ్గించే ప్రయత్నంగానే డీ-లిమిటేషన్ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారని ఆరోపించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించి డీ-లిమిటేషన్కు వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించారని పేర్కొన్నారు. మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీకి అపారమైన గౌరవం ఉందని, మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రత్యేకంగా ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ నాయకత్వం ముందుగానే డిమాండ్ చేసిందన్నారు. బీజేపీ నేతలు అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, తెలంగాణ ప్రజలు వారి కుట్రలను గమనించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని అగౌరవపరిచే విధంగా మాట్లాడిన బీజేపీ ఎంపీలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని,వారు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.బీజేపీ కుట్రల వలలో ప్రజలు చిక్కకూడదని, తెలంగాణ గౌరవాన్ని కించపరిచే ఎలాంటి వ్యాఖ్యలనైనా కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రంలో ఎండగడుతుందని ఎమ్మెల్యే నాగరాజు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.