వాతావరణ అంచనాలు
తెలుగు గళం న్యూస్, పర్వతగిరి / జూన్ 14 :
ఎల్నినో ప్రభావం వల్ల ఈ వానాకాలంలో రాష్ట్రంలో వర్షపాతంలో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది. దీర్ఘకాల సగటులో 90 శాతం మాత్రమే వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.విత్తనాలు నాటే సరైన సమయం:కేవలం తొలకరి జల్లులకే పంటలు వేయవద్దు. రెండు, మూడు మంచి వర్షాలు (సుమారు 60 నుంచి 75 మిల్లీమీటర్ల వర్షం) పడిన తర్వాత, నేలలో తగినంత తేమ ఉన్నప్పుడే విత్తనాలు నాటాలి.
ప్రత్యామ్నాయ పంటలు: వరి వంటి ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలను తగ్గించి, తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు రైతులు మొగ్గు చూపాలి.
నీటి యాజమాన్యం మరియు తేమ సంరక్షణ:నేలలో తేమను నిలుపుకోవడానికి పశువుల ఎరువు, వర్మికంపోస్ట్, వేప చెక్క వంటి సేంద్రియ ఎరువులను వాడాలి.
నీటి సంరక్షణ కోసం ఎత్తైన బెడ్లు, మల్చింగ్ పద్ధతిని పాటించాలి మరియు పొలంలో నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవాలి.
డ్రిప్ ఇరిగేషన్,ఫర్టిగేషన్ పద్ధతులను ఉపయోగించి నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచుకోవాలి.వివిధ పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
మసాలా పంటలు (మిర్చి, పసుపు, ధనియాలు):నీటి ఎద్దడిని తట్టుకునే స్వల్పకాలిక రకాలను ఎంచుకోవాలి. మల్చింగ్, డ్రిప్ ఇరిగేషన్ తో పాటు వేడిని తట్టుకునేందుకు సల్ఫేట్ ఆఫ్ పొటాష్ లేదా పొటాషియం నైట్రేట్ పిచికారీ చేయాలి.పండ్ల తోటలు: మామిడి, జామ, సీతాఫలం, బత్తాయి, నిమ్మ తదితర తోటల్లో ఎండు కొమ్మల కత్తిరింపు, మల్చింగ్, డ్రిప్ ఇరిగేషన్ పాటించాలి. పండ్ల నాణ్యత కోసం పొటాషియం నైట్రేట్, నత్రజని, భాస్వరం వంటివి పిచికారీ చేయాలి.వాణిజ్య & తోట పంటలు: ఆయిల్ పామ్,అరటి, కొబ్బరి, కోకో వంటి పంటల్లో తప్పనిసరిగా మల్చింగ్ మరియు డ్రిప్ ఇరిగేషన్ పద్ధతులు అనుసరించాలి. వ్యాధిగ్రస్తులైన పిలకలను, కొమ్మలను తొలగించి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
కూరగాయలు & సుగంధ ద్రవ్యాలు: వర్షాభావ పరిస్థితులను, స్వల్పకాలిక నీటి ఎద్దడిని తట్టుకునే కూరగాయల రకాలను సాగు చేయాలి. పుదీనా, లెమన్ గ్రాస్, అలోవెరా వంటి పంటలకు కూడా మల్చింగ్,డ్రిప్ విధానాలు మేలు చేస్తాయి.