ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జ్
ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జ్, రాహుల్ గాంధీ – ప్రియాంక గాంధీ అరెస్టులు ప్రజాస్వామ్యంపై దాడి
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ములుగులో భారీ శాంతియుత నిరసన
ప్రశ్నించే గొంతుకలను అణచలేరు.. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై ములుగులో కాంగ్రెస్ ఫైర్
విద్యార్థులపై దాడి దేశ భవిష్యత్తుపై దాడే.. అరెస్టులు వెంటనే ఉపసంహరించాలి: పైడాకుల అశోక్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం, వారికి సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ములుగు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ మాట్లాడుతూ, దేశ భవిష్యత్తు అయిన విద్యార్థులు తమ సమస్యలను శాంతియుతంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని పేర్కొన్నారు. అలాంటి విద్యార్థులపై లాఠీలు ఎత్తి, భయభ్రాంతులకు గురిచేయడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు అండగా నిలవడానికి వెళ్లిన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను అరెస్ట్ చేయడం కేంద్ర ప్రభుత్వ అసహన ధోరణికి నిదర్శనమని విమర్శించారు. ప్రజల గొంతును అణచివేసేందుకు పోలీసు బలాన్ని వినియోగించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకర సంకేతమని అన్నారు. ప్రశ్నించే స్వరాలను అణచివేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే కుట్రలను దేశ ప్రజలు సహించరని హెచ్చరించారు. దేశ యువత ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, వారిపై బలప్రయోగం చేయడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. విద్యార్థులపై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, అరెస్ట్ చేసిన కాంగ్రెస్ నాయకులను తక్షణమే విడుదల చేయాలని, విద్యార్థుల న్యాయమైన డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం స్పందించి పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని, ఆ హక్కును కాలరాయడానికి చేసే ప్రతి ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజలతో కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటుందని స్పష్టం చేశారు. ప్రజల స్వరాన్ని లాఠీలతో, అరెస్టులతో అణచివేయలేరని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగా కళ్యాణి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.