
ఈ69న్యూస్, భూపాలపల్లి / మార్చి 13:
భూపాలపల్లి పట్టణంలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు అక్రమంగా వినియోగిస్తున్నారన్న సమాచారం మేరకు సివిల్ సప్లై శాఖ ఎన్ఫోర్స్మెంట్ బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. పట్టణంలోని హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో చేసిన తనిఖీలలో మొత్తం 13 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు అక్రమంగా వినియోగిస్తున్నట్లు గుర్తించారు.
ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆరుగురు వ్యాపారులపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. గృహ అవసరాల కోసం ప్రభుత్వం అందించే సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగించడం చట్ట విరుద్ధమని, ఇలాంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ తనిఖీలను సివిల్ సప్లై ఇన్స్పెక్టర్లు భాస్కర్ రాజు, సురేందర్ రెడ్డి పర్యవేక్షించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి అక్రమాలను అరికట్టేందుకు తరచూ తనిఖీలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.