మంత్రి పొంగులేటితో సరిత రంగారావు భేటి..
- పార్టీ కోసం కట్టుబడి పనిచేస్తున్న నూకల సరిత రంగారావుకు మంత్రి అభయం..
- డివిజన్ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని హామీ..
- మంత్రి పొంగులేటితో సరిత రంగారావు భేటి..
- పలు అంశాలపై సుదీర్ఘ చర్చ.. పరిష్కారానికి హామీ..
కొత్తగూడెం, ఫిబ్రవరి5(నినాదం)
మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొత్తగూడెం రాజకీయాల్లో వేడి పెరిగింది. తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ, సమాచార శాఖా మంత్రి శ్రీనివాసరెడ్డిని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 5వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి నూకల సరిత మర్యాదపూర్వకంగా కలవడం రాజకీయంగా కీలక పరిణామంగా మారింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసరెడ్డి ఆమెను ఆశీర్వదించి, పార్టీ కోసం కట్టుబడి పనిచేస్తున్నందుకు ప్రత్యేకంగా అభినందించడం రాజకీయ వర్గాల్లో స్పష్టమైన సంకేతాలుగా భావిస్తున్నారు.
5వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తూ, ప్రజల మధ్య నిరంతరం ఉంటూ సమస్యలపై పోరాడుతున్న నాయకత్వమే సరిత రంగారావు అని మంత్రి ప్రశంసించారు. పార్టీ అభ్యర్థిగా ఆమె కృషి ప్రశంసనీయమని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రేణులు ఏకమై పనిచేయాలని పిలుపునిచ్చారు. మంత్రి నుంచి వచ్చిన ఈ స్పష్టమైన మద్దతు, ఆశీర్వాదం నూకల సరిత ఎన్నికల ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చిందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ భేటీలో నూకల సరిత డివిజన్ ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సమస్యలు, గృహ నిర్మాణం, భూ–పట్టాల వంటి కీలక అంశాలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. మాటలకే పరిమితం కాకుండా, నేలపై అభివృద్ధి కనిపించాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టంగా అభిప్రాయపడ్డారు.
మంత్రి శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని, 5వ డివిజన్ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అధికార యంత్రాంగం ద్వారా సమస్యలపై సమీక్ష చేపట్టే దిశగా చర్యలు ఉంటాయని తెలిపారు. మంత్రి ఆశీర్వాదంతో పాటు పార్టీ పెద్దల స్పష్టమైన మద్దతు లభించడంతో 5వ డివిజన్లో కాంగ్రెస్ రాజకీయ దూకుడు మరింత పెరిగిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామంతో ప్రతిపక్షాల్లో కలవరం మొదలైందని, ఎన్నికల సమరం మరింత ఉత్కంఠగా మారిందని స్పష్టమవుతోంది. 5వ డివిజన్లో కాంగ్రెస్ విజయం లక్ష్యంగా అడుగులు వేగవంతమయ్యాయని ఈ భేటీ స్పష్టమైన రాజకీయ సందేశం ఇస్తోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో టిపిసిసి జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు, డిసిసి ప్రెసిడెంట్ తోట దేవిప్రసన్న, రాష్ట్ర నాయకులు ఊకంటి గోపాల్ రావు, పాల్వంచ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు తదితరులు పాల్గొన్నారు.