రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ కార్యదర్శి కె.సురేంద్ర మోహన్
మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలి
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి
రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోలు,నిల్వ, రవాణా ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ కార్యదర్శి కె.సురేంద్ర మోహన్ అధికారులను ఆదేశించారు.సోమవారం హైదరాబాద్ నుండి ఆయన వివిధ జిల్లాల అధికారులతో మొక్కజొన్న సేకరణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కీలక దిశానిర్దేశం చేశారు.ఈ సమీక్షా సమావేశంలో భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ నుండి అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కార్యదర్శి సురేంద్ర మోహన్ మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీ చార్జీల పెంపు, గన్నీ బ్యాగుల లభ్యత, తగినంత స్టోరేజ్ స్పేస్,సకాలంలో రవాణా సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.ముఖ్యంగా రైతులు తమ సొంత గన్నీ బ్యాగులను తీసుకువచ్చిన సందర్భంలో వాటిని నిబంధనల ప్రకారం ఎంట్రీ చేసే విధానంపై స్పష్టతనిచ్చారు.క్షేత్రస్థాయిలో మొక్కజొన్న కొనుగోళ్లు సజావుగా సాగేలా చూడాలని, రైతులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు.అనంతరం అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ, జిల్లాలో మొక్కజొన్న సేకరణకు సంబంధించి తీసుకుంటున్న చర్యలను కార్యదర్శికి వివరించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా వ్యవసాయ అధికారి బాబూరావు,జిల్లా సహకార అధికారి వాలియా నాయక్, మార్క్ఫెడ్ నోడల్ అధికారులు,మార్కెటింగ్ శాఖకు చెందిన ఇతర అధికారులు పాల్గొన్నారు.