సీపీఎం కౌన్సిలర్ బూడిద జ్యోతి
సీపీఎం కౌన్సిలర్ బూడిద జ్యోతి
తెలుగు గళం న్యూస్ జనగామ, జూన్ 5
వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో జనగామ పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు వరద నివారణ చర్యలను పకడ్బందీగా అమలు చేయాలని మూడవ వార్డు సీపీఎం కౌన్సిలర్ బూడిద జ్యోతి మున్సిపల్ అధికారులను కోరారు.జనగామ పట్టణంలో డ్రైనేజీ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు వర్షాలు కురిసినప్పుడు రోజుల తరబడి మురుగు నీటిలో మునిగిపోయే పరిస్థితి నెలకొంటోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మురుగు నీరు నిల్వ ఉండటం వల్ల పాములు, తేళ్లు, ఇతర విషపురుగులు ఇళ్లలోకి ప్రవేశించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.మూడవ వార్డులోని బాలాజీ నగర్, జ్యోతి నగర్, హైదరాబాద్ మెయిన్ రోడ్ ప్రాంతాల్లో స్వల్ప వర్షానికే రహదారులు జలమయం అవుతున్నాయని తెలిపారు. వరదనీటి నివారణ కోసం చేపట్టిన పెద్దమూరి పనులు ఇంకా పూర్తికాకపోవడం భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులకు దారితీయవచ్చని హెచ్చరించారు.పెండింగ్లో ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.పట్టణంలో కోతుల బెడద రోజురోజుకూ పెరుగుతోందని, మహిళలు, చిన్నారులపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. అలాగే వీధి కుక్కలు, పందుల సమస్య కూడా అధికంగా ఉందని, ముఖ్యంగా కలెక్టర్ కార్యాలయం సమీపంలోని గార్లకుంట ప్రాంతం వాటికి ఆవాసంగా మారిందని చెప్పారు. సంబంధిత శాఖలు తక్షణ చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు.దోమల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, ఫాగింగ్, బయోటెక్ స్ప్రేలు, ఆయిల్ బాల్స్ వినియోగాన్ని విస్తృతంగా చేపట్టాలని సూచించారు. డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మున్సిపాలిటీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కోరారు.పట్టణంలో తడి చెత్త, పొడి చెత్త వేరు చేసే విధానాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని, ప్రతి కుటుంబానికి చెత్త బుట్టలు పంపిణీ చేయాలని సూచించారు. ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వినియోగాన్ని తగ్గించే చర్యలను కట్టుదిట్టం చేయాలని అన్నారు.మూడవ వార్డులో రహదారులు, మురుగు కాలువల నిర్మాణానికి అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీకి అత్యధిక ఆదాయం పన్నుల రూపంలో ఈ వార్డు నుంచే వస్తున్నప్పటికీ సమస్యలు కూడా ఎక్కువగానే ఉన్నాయని మున్సిపల్ కమిషనర్, చైర్పర్సన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.ప్రస్తుతం ఉన్న మున్సిపల్ పారిశుధ్య కార్మికుల సంఖ్య పట్టణ అవసరాలకు సరిపోవడం లేదని పేర్కొన్న జ్యోతి, వెంటనే అదనపు కార్మికులను నియమించి మూడవ వార్డుకు కనీసం నలుగురు పారిశుధ్య సిబ్బందిని కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రజారోగ్యం, పారిశుధ్యం, వరద నివారణ అంశాలపై మున్సిపాలిటీ ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె కోరారు.