వి బి- జి రామ్ జి పథకం రద్దుచేసి ఎం జి నరేగాను పునరుద్ధరించాలి.
కేంద్ర ప్రభుత్వ పైరాష్ట్ర ముఖ్యమంత్రి ఒత్తిడి తేవాలి
200 రోజులు పనులు కలిగించాలి.
రోజు కూలీ రూ.700 ఇవ్వాలి
బి కె యం యు జాతీయ కార్యవర్గ సభ్యుడు వెంకట్రాములు
కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి కూలీల ప్రయోజనాలను దెబ్బతీసే విబి-జీ రామ్ జి ని రద్దుచేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించి అమలు జరపాలని భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యుడు తాటిపాముల వెంకట్రాములు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్మికులు వ్యతిరేకిస్తున్న ఈ నూతన పథకాన్ని జూలై 1 నుండి అమలు జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలతో ప్రదించకుండా నూతన ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించవద్దని, ప్రస్తుతము జరుగుతున్న పనులన్ని పూర్తయ్యే వరకు 100% నిధులు కేంద్ర ప్రభుత్వమే ఇవ్వాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క చేసిన డిమాండ్ ను కేంద్ర ప్రభుత్వం పరిగణన లోకి తీసుకోవాలన్నారు. ఈ పథకం అమలైతే రాష్ట్రం 40 శాతం కేంద్రం 60 శాతం నిధులు భరించాల్సి ఉంటుందని రాష్ట్రాలపై పెను భారం పెరిగి రాష్ట్ర ప్రభుత్వాలకు గుదిబండగా తయారై పథకం అటకెక్కి కూలీల నోట్లో మట్టి పడుతుందన్నారు. కేంద్రం తెచ్చిన కొత్త పథకాన్ని రద్దుచేసి యంజీ నరేగాను పునరుద్ధరించి అమలు జరపాలని ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వంపై వెంటనే ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. రైతు కూలీలు గ్రామీణ పేదలు చైతన్యంతో సంఘటితమై ఉపాధి హామీ చట్టం పునరుద్ధరణ కోసం, సంవత్సరంలో 200 రోజులు పని ,రోజుకు రూ. 700 కూలి, వ్యవసాయ కార్మికులకు నెలకు రూ. 6000 పెన్షన్ తదితర డిమాండ్స్ సాధనకై వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ సమితి పిలుపుననుసరించి జూన్ 23 న జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ప్రదర్శనలు, ధర్నాలలో గ్రామీణ శ్రమజీవులు పెద్ద ఎత్తున పాల్గొని కార్మిక ప్రజావ్యతిరేక పాలకులపై సమర శంఖం పూరించాలని వెంకట్రాములు పిలుపునిచ్చారు.