విద్యార్థుల కలలను చిదిమేస్తున్న పాలకులు

ఒక దేశ అభివృద్ధి ఆ దేశ విద్యా వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. విద్య అనేది కేవలం ఉద్యోగం సంపాదించే సాధనం మాత్రమే కాదు; శాస్త్రీయ దృక్పథం, ప్రజాస్వామ్య విలువలు, సామాజిక బాధ్యత కలిగిన పౌరులను తీర్చిదిద్దేది విద్య . అందుకే ప్రతి దేశం విద్యను అత్యంత ప్రాధాన్య రంగంగా పరిగణిస్తుంది. కానీ నేడు మన దేశంలో విద్యారంగంలో జరుగుతున్న పరిణామాలు విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
ఈ ఆందోళనకు ప్రధాన కారణం జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల నిర్వహణలో వరుసగా వెలుగుచూస్తున్న లోపాలే. నీట్ వంటి పరీక్షల్లో పేపర్ లీకేజీ విద్యా వ్యవస్థపై ఉన్న విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. సుమారు 22 లక్షల మంది విద్యార్థులు ఏళ్ల తరబడి కష్టపడి చదివి, కుటుంబాలు లక్షల రూపాయలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకున్నవారు ఉన్నారు అయితే ఒక పేపర్ లీకేజీతో వారి శ్రమ, వారి కలలు, వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది
ఈ పరిస్థితుల ప్రభావం కేవలం పరీక్షల వరకే పరిమితం కావడం లేదు. విద్యార్థుల్లో తీవ్రమైన మానసిక ఒత్తిడి, నిరాశ పెరుగుతున్నాయి. పేపర్ లీకేజీల నేపథ్యంలో ఇప్పటివరకు 11 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం అత్యంత విషాదకరం. దీనికి కేంద్ర ప్రభుత్వమే NTA (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) వైపల్యమే ప్రధాన కారణం
నేడు దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు విద్యార్థులు కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఆందోళనలు నిర్వహిస్తున్నారు , ఇప్పటికీ విద్యార్థుల్లో నమ్మకం కలిగించే స్థాయిలో ప్రభుత్వం స్పందించలేదు, ప్రభుత్వంలో జవాబుదారుతనం లోపించింది
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కావని భరోసా కల్పించలేని నిస్సాయ స్థితిలో ప్రభుత్వ పాలకులు ఉన్నట్లు స్పష్టంగా అర్థం అవుతుంది
మరోవైపు, డిజిటల్ ఇండియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అత్యాధునిక సాంకేతికత గురించి గొప్పలు చెప్పే ప్రభుత్వం, ఒక జాతీయ స్థాయి పరీక్షలను పారదర్శకంగా నిర్వహించలేకపోవడం పాలకుల డొల్లతనం కనబడుతుంది జాతీయ పరీక్షల సంస్థ (NTA)పై వరుసగా వస్తున్న ఆరోపణలు పరీక్షల విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయి. గతంలో కూడా నీట్, నెట్ వంటి పరీక్షల లీకేజీలు జరిగిన పరీక్షల నిర్వాహన వ్యవస్థలో సమూల సంస్కరణలు తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది
ఇలాంటి పరిస్థితుల్లో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాలి. పరీక్షల నిర్వహణలో పూర్తి పారదర్శకత, జవాబుదారీతనం, సాంకేతిక భద్రతను నిర్ధారించాలి. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తిరిగి నమ్మకం కల్పించాల్సిన బాధ్యత పాలకులపైనే ఉంది.
అదే సమయంలో విద్యారంగానికి సంబంధించిన విధానాలపైనా తీవ్రమైన చర్చ అవసరం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అధికారాలను క్రమంగా తన నియంత్రణలోకి తీసుకుంది. నూతన జాతీయ విద్యా విధానం శాస్త్రీయ దృక్పథాన్ని, హేతుబద్ధ ఆలోచనను పెంపొందించకుండా, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉద్యోగుల తయారీకి మాత్రమే పరిమితమవుతోందనే ఆందోళన విద్యావేత్తల్లో వ్యక్తమవుతోంది. విద్య అనేది కేవలం కంపెనీలకు ఉద్యోగులను తయారు చేసే ప్రక్రియ కాదు; , ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే చైతన్యవంతమైన పౌరులను తయారు చేసే వ్యవస్థ.
భారత విద్యా చరిత్ర కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వంటి మహనీయులు విద్యను సమానత్వానికి, సామాజిక న్యాయానికి, విముక్తికి సాధనంగా భావించారు. వారి దృష్టిలో విద్య అంటే కేవలం డిగ్రీ కాదు; శాస్త్రీయ ఆలోచన, హేతుబద్ధ దృక్పథం, ప్రజాస్వామ్య చైతన్యాన్ని పెంపొందించే ప్రక్రియ.
అందువల్ల జాతీయ పరీక్షల వ్యవస్థలో సమూల సంస్కరణలు చేపట్టాలి. పేపర్ లీకేజీలకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసి ప్రతి విద్యార్థికి నాణ్యమైన, పారదర్శకమైన, నమ్మకమైన విద్యను అందించాలి.
ఒక దేశ అభివృద్ధిని నిర్మించేది అద్దాల మేడలు రంగుల గోడలు కాదు; పౌరుల నైతిక అభివృద్ధి నిజమైన దేశాభివృద్ధి ఆ నైతిక అభివృద్ధిని తీర్చిదిద్దేది విద్య. అలాంటి విద్యనే నిర్లక్ష్యం, వ్యాపారం అవినీతిమయం, పేపర్ లీకేజీలతో బలహీనపరిస్తే నష్టపోయేది ఒక్క విద్యార్థి కాదు—దేశ భవిష్యత్తే.
డా ఆర్ ఎల్ మూర్తి
నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్,
DYFI రాష్ట్ర ఉపాధ్యక్షులు
8247672658