శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాగరాజు
వరంగల్ జిల్లా:వర్ధన్నపేట పట్టణ పరిధిలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కే.ఆర్. నాగరాజు స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం సీతారాముల కళ్యాణాన్ని తిలకించారు.అనంతరం భక్తులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, శ్రీరాముడు చూపిన ధర్మం, న్యాయం, విధేయత ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు. సీతారాముల అనుబంధం, ప్రేమానురాగాలు నేటి సమాజానికి మార్గదర్శకమని అన్నారు. “తల్లిదండ్రుల పట్ల శ్రీరాముడు చూపిన భక్తి, గౌరవం ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి. రామరాజ్యం అంటే కేవలం పరిపాలన కాదు, కుటుంబ విలువల సమ్మేళనం. నేటి యువత సీతారాముల జీవితం నుంచి స్ఫూర్తి పొంది సమాజ అభివృద్ధికి కృషి చేయాలి” అని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధిపై తనకున్న నిబద్ధతను వ్యక్తం చేస్తూ, శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ అభివృద్ధి కోసం తన సొంత జీతం నుంచి నిధులు కేటాయిస్తానని ప్రకటించారు. ఆలయ పునర్నిర్మాణం మరియు అవసరమైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతానని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు,స్థానిక ప్రజాప్రతినిధులు మరియు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.