E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ5 April, 2026E69NEWS

లింగ నిర్ధారణ, లింగ ఎంపికపై కఠిన చర్యలు: వరంగల్ పోలీస్ కమిషనర్ హెచ్చరిక


వరంగల్: గర్భంలో ఉన్న శిశువు లింగ నిర్ధారణ, లింగ ఎంపిక వంటి చట్ట విరుద్ధ చర్యలను పూర్తిగా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, ఐపీఎస్ తెలిపారు. ఈ మేరకు కమిషనరేట్ పరిధిలో చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.
గర్భంలోని శిశువు లింగాన్ని తెలుసుకోవడం, తెలియజేయడం లేదా ఆ ఆధారంగా గర్భస్రావం చేయించడం వంటి చర్యలు సమాజానికి తీవ్రమైన ముప్పుగా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఆడ శిశువుల సంఖ్య తగ్గడానికి ఇవే ప్రధాన కారణమని తెలిపారు.
ఈ నేపథ్యంలో కమిషనరేట్ పరిధిలోని అన్ని అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లు తప్పనిసరిగా చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్‌తోనే పనిచేయాలని, ప్రభుత్వ నిబంధనలను పూర్తిగా పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఎక్కడైనా లింగ నిర్ధారణ జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 100, ఎస్‌బి కంట్రోల్ రూమ్ నంబర్ 8712685257కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.
ఆడపిల్లల సంరక్షణ, లింగ సమానత్వం కాపాడటం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు.

About The Author

E69NEWSe69news.com

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *