గాలికుంటు వ్యాధి నివారణపై అప్రమత్తంగా ఉండాలిగాలికుంటు వ్యాధి నివారణపై అప్రమత్తంగా ఉండాలి
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ23 March, 2026E69NEWS

గాలికుంటు వ్యాధి నివారణపై అప్రమత్తంగా ఉండాలి

గాలికుంటు వ్యాధి నివారణపై అప్రమత్తంగా ఉండాలి

ఉచిత టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ రాహుల్ శర్మ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పశువులలో వ్యాపించే గాలికుంటు వ్యాధి నివారణపై పశుపోషకులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు.సోమవారం ఐడిఓసి కార్యాలయంలో పశువైద్య,పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా జాతీయ పశువ్యాధుల నివారణ కార్యక్రమం కింద ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల ప్రచార రథాన్ని, కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి ఒక అంటువ్యాధి అని, ఇది పికార్నో వైరస్ వల్ల వ్యాపిస్తుందని తెలిపారు. ముఖ్యంగా ఓ, ఏ, ఏ ఎస్ ఐ ఏ-1 రకాల వైరస్‌లు ఈ వ్యాధికి కారణమవుతాయని పేర్కొన్నారు.ఈ వ్యాధి వల్ల పశువుల మరణాలు తక్కువగా ఉన్నప్పటికీ, పాలు దిగుబడి తగ్గడం, పునరుత్పత్తి సామర్థ్యం దెబ్బతినడం వంటి సమస్యలు తీవ్రంగా ప్రభావితం చేస్తాయని తెలిపారు. సంకరజాతి పశువుల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వివరించారు.వ్యాధి లక్షణాలుగా అధిక జ్వరం (104°F నుంచి 106°F వరకు), నోరు మరియు కాళ్ల గిట్టల మధ్య బొబ్బలు, నోటి నుంచి చొంగ కారడం, పాలు తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు. పశువులు మేత, నీరు తీసుకోక నీరసించి తీవ్రమైన పరిస్థితికి దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.ఈ వ్యాధి నివారణకు పశువుల పాకలను పరిశుభ్రంగా ఉంచడం, నాలుగు నెలల వయస్సు దాటిన దూడలు, పెద్ద పశువులకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి టీకాలు వేయించడం అత్యంత ముఖ్యమని సూచించారు.వ్యాధి సోకిన పశువులను వెంటనే వేరుచేసి, పుండ్లను పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో శుభ్రపరచాలని, నోటి పుండ్లకు బోరోగ్లిసరిన్ ఉపయోగించాలని తెలిపారు.తక్షణమే సమీప పశువైద్యులను సంప్రదించి చికిత్స పొందాలని పశుపోషకులకు సూచించారు.ఈ ఏడాది కూడా ఉచిత టీకాల కార్యక్రమం కింద పశువైద్య బృందాలు ప్రతి గ్రామాన్ని సందర్శించి, మూడు నెలల వయస్సు దాటిన గేదెలు, ఆవులకు టీకాలు వేయనున్నట్లు తెలిపారు. రైతులు తప్పనిసరిగా తమ పశువులకు టీకాలు వేయించుకోవడంతో పాటు గుర్తింపుకోసం చెవిపోగు వేయించుకుని వివరాలను ‘భారత్ పశుధన్’ యాప్‌లో నమోదు చేయాలని కోరారు.జిల్లాలో గాలికుంటు వ్యాధి పూర్తిగా నిర్మూలనకు ప్రతి పశుపోషకుడు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్,విజయలక్ష్మి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు, పశువైద్యులు తదితరులు పాల్గొన్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *