అభివృద్ధి పనులపై అదనపు కలెక్టర్ విజయలక్ష్మి సమీక్ష
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి బుధవారం ప్రత్యక్షంగా పరిశీలించారు.సంబంధిత శాఖల అధికారులతో కలిసి మండల కేంద్రంలోని వివిధ ప్రాజెక్టులను సందర్శించి పనుల పురోగతిని సమీక్షించారు.ఈ సందర్భంగా మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఆమె, పనుల ప్రగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.నిర్మాణ పనులను వేగవంతం చేసి, జూన్ 2వ తేదీలోగా పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ప్రజలకు సమయానికి మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రావాలంటే పనులు ఆలస్యం కాకూడదని ఆమె సూచించారు.అనంతరం పలిమెల గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న నర్సరీని పరిశీలించిన అదనపు కలెక్టర్, మొక్కల సంరక్షణ, పచ్చదనం పెంపుపై గ్రామస్థాయి అధికారులకు పలు సూచనలు చేశారు.గ్రామాభివృద్ధిలో నర్సరీల ప్రాధాన్యతను గుర్తు చేస్తూ,పర్యావరణ పరిరక్షణలో అధికారులు చురుకుగా వ్యవహరించాలని తెలిపారు.తదుపరి పలిమెల పల్లె దవాఖానను సందర్శించిన ఆమె, ప్రారంభోత్సవానికి సంబంధించి ముందస్తుగా 99 రోజుల ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సేవల ప్రారంభం సమర్థవంతంగా జరిగేలా అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.ఇక నీలంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని సబ్ సెంటర్ నిర్మాణాన్ని త్వరితగతిన ప్రారంభించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సదుపాయాలు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి (డిఎంహెచ్వో) మధుసూదన్, పంచాయతీరాజ్ ఈఈ వెంకటేశ్వర్లు, డిఈ సాయిల్, మెడికల్ ఆఫీసర్లు కళ్యాణి, రఘురాం, ఏపీఎం రాజాలింగు, కార్యదర్శి శ్రీధర్ మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.అభివృద్ధి పనులను సమయపాలనతో పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేయాలని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి అధికారులకు దిశానిర్దేశం చేశారు.