వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి, జూన్ 5
దేశంలో ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన ఓటు హక్కును బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ముఖ్యంగా బీజేపీ ఓటర్ల జాబితాలను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగిస్తూ ప్రమాదకర రాజకీయాలకు పాల్పడుతోందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ఆరోపించారు.భూపాలపల్లిలోని ఎల్.వి. కన్వెన్షన్‌లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి బూత్ లెవల్ ఏజెంట్ల అవగాహన సదస్సుకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుతో కలిసి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె, ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కార్యకర్తలకు సమగ్ర అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ కడియం కావ్య, ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా ఓటర్ల జాబితాల సవరణ జరిగే ప్రతి దశలోనూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఓటర్ల జాబితాల్లో పేర్లు తొలగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.దేశంలోని పలు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల అవకతవకల కారణంగా ముఖ్యమంత్రులుగా పనిచేసిన నాయకులు కూడా తమ సొంత నియోజకవర్గాల్లో ఓటమి చవిచూసిన ఉదాహరణలు ఉన్నాయని పేర్కొన్నారు.ఓటర్ల పేర్ల తొలగింపు, అనుమానాస్పదంగా కొత్త పేర్ల చేర్పులు, ఓటర్లను గందరగోళానికి గురిచేసే చర్యలు ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారాయని అన్నారు.ప్రజల మద్దతుతో గెలవలేకపోతే ఓటర్ల జాబితాల ద్వారానే రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించిన ఆమె, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి బీఎల్ఏ, ప్రతి బూత్ అధ్యక్షుడు ఓటు హక్కు పరిరక్షణ కోసం సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు.అలాగే రాహూల్ గాంధీ దేశవ్యాప్తంగా ఓటు చోరీ, ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత లోపాలపై చేస్తున్న పోరాటం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమేనని పేర్కొన్నారు.ఓటు హక్కును కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు.వచ్చే మూడు నెలల పాటు బీఎల్ఏలు, బీఎల్ఓలు కలిసి ఇంటింటికీ వెళ్లి ఓటర్ల జాబితాలను పరిశీలించాలని, కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పుల సవరణ, తొలగించబడిన పేర్ల గుర్తింపు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.ప్రతి అర్హుడికి ఓటు హక్కు అందేలా చూడటమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని చెప్పారు.”ఓటర్ల జాబితానే ఎన్నికల విజయానికి తొలి అడుగు. బూత్ బలంగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుంది.బీజేపీ కుట్రలను క్షేత్రస్థాయిలోనే తిప్పికొట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి” అని ఎంపీ కడియం కావ్య పిలుపునిచ్చారు.అనంతరం ఆమె రూపొందించిన ‘బూత్ లెవల్ ఏజెంట్స్ సంక్షిప్త సమాచారం హ్యాండ్‌బుక్’ను ఆవిష్కరించి బీఎల్ఏలు, డివిజన్ ఇన్‌చార్జ్‌లకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ కోఆర్డినేటర్ సిరాజ్ హుస్సేన్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బట్టు కర్ణాకర్, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, డివిజన్ అధ్యక్షులు, బూత్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.