చెక్‌డ్యామ్‌లలో ఇసుక తొలగింపుతో భూగర్భ జలాల పెంపు
జిల్లాలోని చెక్‌డ్యామ్‌లలో పేరుకుపోయిన ఇసుకను శాస్త్రీయ పద్ధతిలో తొలగించడం (డీ-సిల్టింగ్) ద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచవచ్చని, ఇది భూగర్భ జలాల పునరుద్ధరణకు ఎంతో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు.శనివారం జిల్లా కలెక్టరేట్ (ఐడీఓసీ) కార్యాలయంలో మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, చెక్‌డ్యామ్‌లలో పూడిక తీయడం వల్ల వర్షపు నీరు గరిష్టంగా నిల్వ ఉండటమే కాకుండా, పరిసర ప్రాంతాల్లో సాగునీటి లభ్యత పెరుగుతుందని తెలిపారు.ముఖ్యంగా మల్హర్రావు మండలంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న చెక్‌డ్యామ్‌ల నుండి ఇసుకను తొలగించే అంశంపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. వల్లంకుంట గ్రామం వద్ద ఉన్న అడవిసోమనపల్లి చెక్‌డ్యామ్, మల్లారం గ్రామంలోని చిన్న ఓదెల చెక్‌డ్యామ్, తాడిచెర్ల గ్రామంలోని గోపాల్పూర్ ఖమ్మంపల్లి చెక్‌డ్యామ్‌లలో పేరుకుపోయిన ఇసుకను తొలగించే ప్రక్రియపై సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.ఇసుక తవ్వకాల విషయంలో పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఇరిగేషన్, మైనింగ్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ప్రభుత్వ మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తూనే ఇసుక తొలగింపు ప్రక్రియను చేపట్టాలని, ఎక్కడా అక్రమ రవాణాకు తావు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.నిబంధనలు అతిక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, మైనింగ్ ఏడీ జయరాజ్, జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) శ్రీలత, పెద్దపల్లి టిజిఎండిసి పిఓ విష్ణు వర్ధన్, ఇరిగేషన్ డీఈఈ రమేష్, ఆర్ డబ్ల్యూ ఎస్ ఏఈ వినీత్, ఎన్విరాన్మెంటల్ ఏఈ అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.