టెండర్ విధానాన్ని రద్దు చేయాలి
వరంగల్ అర్బన్:రాష్ట్ర ప్రభుత్వం టెండర్ విధానాన్ని రద్దుచేసి టెస్కో ద్వారానే బెడ్షీట్లు,కార్పెట్లు ఖరీదు చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద చేనేత కార్మికులు చేపట్టిన నిరసన దీక్షలు బుధవారం 5వ రోజుకు చేరుకున్నాయి.ఆప్కో మాజీ డైరెక్టర్ దేవులపల్లి సత్యనారాయణ మూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు ప్రసంగిస్తూ, అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత కార్మికులకు త్రిఫ్ట్ పథకం,చేనేతకు చేయూత’ తదితర సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయడం లేదని ఆరోపించారు. కూలీ 30% పెంచినట్లు ప్రకటించి ఇంతవరకు అమలు చేయకపోవడంతో కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.సహకార సంఘాల నుంచి వస్త్రాలను ఖరీదు చేసిన టెస్కో గత ఏడు నెలలుగా పేమెంట్ చేయకపోవడం దారుణమన్నారు. చేనేత వృత్తిని శాశ్వతంగా సమాధి చేసేందుకే టెండర్ విధానాన్ని తెచ్చిందని మండిపడ్డారు. కార్మికుల నిరసన ఉద్యమాలు చూసైనా ప్రభుత్వం వైఖరి మార్చుకొని చేనేత కార్మికులు నేసిన వస్త్రాలు తీసుకోవాలని, లేకుంటే ఉద్యమం తీవ్ర రూపం దాలిస్తే ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు.ఐక్య పోరాటాలు ఉద్ధృతం చేస్తాం: వీర మోహన్ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీర మోహన్ మాట్లాడుతూ,చేనేత కార్మికుల న్యాయమైన పోరాటానికి సంఘీభావం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం 2024లో ప్రకటించిన జీవోను తుంగలో తొక్కి టెండర్ విధానం ప్రవేశపెట్టడం అత్యంత దుర్మార్గమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆప్కో తర్వాత టెస్కో సహకార సంఘాల ద్వారా చేనేత ఉత్పత్తులను ఖరీదు చేసి ప్రభుత్వ సంస్థలకు అందించేదన్నారు. ముఖ్యమంత్రి చొరవ తీసుకుని తక్షణమే టెండర్ విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించి చేనేత పరిశ్రమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా చేనేత ఐక్య పోరాటాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నాయకులు డాక్టర్ ప్రసాద్, పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకులు చందా మల్లయ్య తదితరులు సంఘీభావం తెలిపారు.నిరసన దీక్షలో చేనేత నాయకులు పంతగాని శ్రీనివాసు,మాషబత్తుల కుమారస్వామి,ఎలుగం చిన్న భద్రయ్య, అడిగొప్పల సంపత్, ఎలుగం రవిరాజు,ఎలుగం వెంకటమల్లు, కొలిపాక మదనయ్య, కూరపాటి సంపత్,ఊషకోయల రాజేశం,దువ్వల రాజేందర్, ఎలుగం చిన కొమురయ్య,ఊర వేణు, ఎలుగం చిన్న వీరస్వామి, కోట మల్లయ్య, తాటిపాముల మల్లికార్జున్, వావిలాల బిక్షపతి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.