ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ మరియు ప్రజా ప్రవర్తన నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఎస్సై దాసరి సుధాకర్ ప్రజలకు సూచించారు.ఈ మేరకు ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.ఈ సందర్భంగా ఎస్సై దాసరి సుధాకర్ మాట్లాడుతూ, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. రోడ్లు, పార్కులు మరియు ఇతర ప్రజా ప్రదేశాలలో మద్యం సేవించే వ్యక్తులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అలాగే మద్యం సేవించి వాహనం నడపడం (డ్రంక్ అండ్ డ్రైవ్) తీవ్రమైన నేరమని, ఇటువంటి ఘటనలు రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్నాయని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్ డ్రైవర్లు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. ఈ నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. అలాగే 18 సంవత్సరాలు నిండని మైనర్లు వాహనాలు నడపరాదని,తల్లిదండ్రులు దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.రోడ్లపై అనధికారికంగా వాహనాలు నిలిపివేయడం వల్ల ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని,నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే చర్యలు తప్పవని తెలిపారు.ప్రజలు ట్రాఫిక్ నియమాలను గౌరవించి పోలీసులకు సహకరించాలని సూచించారు.వదంతులు, అపోహలను నమ్మకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎస్సై దాసరి సుధాకర్ పిలుపునిచ్చారు.పోలీసులు ప్రజల భద్రత కోసం కట్టుబడి పనిచేస్తున్నారని, నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు.