నారాయణగిరి గ్రామంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
ధర్మసాగర్ (తెలుగు గళం) జూన్ 02:
ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.గ్రామంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద జాతీయ పతాకాన్ని, పార్టీ జెండాను ఆవిష్కరించి తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, జూన్ 2 తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన చారిత్రాత్మక రోజు అని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విద్యార్థులు, యువత, ఉద్యోగులు, రైతులు, మహిళలు సహా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు చేసిన ఉద్యమాలు, త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు.ఎన్నో సంవత్సరాల పోరాటం, వేలాది మంది ఉద్యమకారుల అహర్నిశల కృషి,అమరవీరుల ప్రాణత్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని గుర్తు చేశారు.తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల సేవలను స్మరించుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.తెలంగాణ ఏర్పడిన తర్వాత గ్రామీణాభివృద్ధి,సాగునీటి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల కల్పనలో రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించిందని తెలిపారు.అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితం తెలంగాణ రాష్ట్రం. వారి ఆశయాల సాధనే వారికి నిజమైన నివాళి. అని నాయకులు పేర్కొన్నారు.