


రేగొండ మండలం రేపాకపల్లి గ్రామంలో విషాదం
ఈ69న్యూస్ జయశంకర్ భూపాలపల్లి మే23
భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాకపల్లి గ్రామంలో శనివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. తమ వ్యవసాయ పొలంలో గడ్డిని తగులబెడుతున్న సమయంలో మంటలు అదుపుతప్పడంతో వృద్ధ రైతు సాగర్ల చంద్రమౌళి (62) సజీవ దహనమయ్యారు.స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. చంద్రమౌళి తన పొలంలో ఉన్న గడ్డిని కాల్చుతుండగా ఒక్కసారిగా వీచిన గాలులతో మంటలు పక్క పొలాలకు వ్యాపించాయి. మంటలను అదుపు చేయడానికి ఆయన ఒంటరిగా ప్రయత్నించారు. అయితే వయోభారం, మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న ఆయన ప్రమాదవశాత్తు కిందపడిపోయారు. వెంటనే పైకి లేవలేకపోవడంతో మంటలు ఆయన బట్టలకు అంటుకుని తీవ్రంగా వ్యాపించాయి.దట్టమైన పొగ, మంటల మధ్య చిక్కుకున్న చంద్రమౌళి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటన సమయంలో సమీపంలోనే ఉన్న భార్య భాగ్యమ్మ, కుమారుడు భాస్కర్ మంటల తీవ్రత కారణంగా ఆయనను రక్షించలేకపోయారు. కళ్లముందే కుటుంబ పెద్ద మంటల్లో కాలిపోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు హృదయ విదారకంగా మారాయి.సమాచారం అందుకున్న రేగొండ ఎస్ఐ డి. సుధాకర్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.ఈ ఘటనతో రేపాకపల్లి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.