
ఈ69న్యూస్ జనగామ జూన్ 07
జనగామ పట్టణంలోని మూడవ వార్డుతో పాటు రెండో, నాలుగో వార్డుల శివారు కాలనీల ప్రజలు మౌలిక సదుపాయాల లేమితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.దశాబ్దాలుగా ఇక్కడ నివసిస్తూ ప్రభుత్వానికి ఇంటి పన్నులు, ఇతర పన్నులు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నప్పటికీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు లేకపోవడంతో కాలనీలు సమస్యల నిలయాలుగా మారాయి.మురుగు నీరు నిల్వ ఉండటం, ఖాళీ ప్రదేశాల్లో చెత్త పేరుకుపోవడం వల్ల పాములు, విషపురుగులు అధికంగా సంచరిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఇండ్ల మధ్యలోనే పాములు కనిపించడం సాధారణమైందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలు బయటకు రావాలన్నా, రాత్రి వేళల్లో ఇంటి నుంచి బయటకు వెళ్లాలన్నా భయపడే పరిస్థితి నెలకొంది.డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో దుర్వాసన వెదజల్లడంతో పాటు దోమల బెడద కూడా పెరిగిందని ప్రజలు వాపోతున్నారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో సమస్య మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.ఏళ్ల తరబడి సమస్యలు చెప్పుకుంటున్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం చేపట్టి కాలనీల ప్రజలకు ఉపశమనం కల్పించాలని కోరుతున్నారు.