విద్యుత్ కార్మికుల సమ్మెకు బీజేపీ మద్దతు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేటీపీపీ (చెల్పూర్)లో విద్యుత్ ఆర్టిసన్, అన్-మ్యాన్డ్, పీస్ రేట్ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన సమ్మెకు బీజేపీ నేతలు సంఘీభావం తెలిపారు.బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తి రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఏడునూతల నిషిధర్ రెడ్డి నేడు సమ్మె ప్రదేశాన్ని సందర్శించి కార్మికులతో కలిసి కూర్చొని వారి సమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కీర్తి రెడ్డి మాట్లాడుతూ, “దేశానికి వెలుగులు నింపే విద్యుత్ కార్మికుల జీవితాల్లో ప్రభుత్వం చీకట్లు నింపడం అన్యాయం. వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి” అని అన్నారు.కార్మికుల హక్కుల సాధనలో బీజేపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని,అవసరమైతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.కార్మికులు తమ ప్రధాన డిమాండ్లుగా విద్యుత్ సంస్థల్లో అర్హత కలిగిన ప్రతి ఆర్టిసన్ ఉద్యోగిని కన్వర్షన్ చేయాలని,ఏపిఎస్ఈబి సర్వీస్ రూల్స్ అమలు చేయాలని,అన్-మ్యాన్డ్ వర్కర్లను ఆర్టిసన్లుగా విలీనం చేయాలని,2016కు ముందు పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికులను గుర్తించాలని,జీవో నెం.11 ప్రకారం కనీస వేతనాలు మరియు 2026 పి ఆర్ సి అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ధర్నా నిర్వహించడానికి కనీసం టెంట్ వేసుకోవడానికి కూడా అనుమతి ఇవ్వని పరిస్థితి ఉందని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విషయంపై కీర్తి రెడ్డి సంబంధిత అధికారులతో నేరుగా మాట్లాడి వెంటనే అనుమతి ఇవ్వాలని కోరారు. రేపటివరకు అనుమతి లభించకపోతే తామే టెంట్ ఏర్పాటు చేసి కార్మికులకు పూర్తి మద్దతు అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఊర నవీన్ రావు, ప్రధాన కార్యదర్శి బనగాని రాజశేఖర్, సోషల్ మీడియా కన్వీనర్ సాయి పటేల్, బూత్ అధ్యక్షులు జెడ్సన్, కంకణాల వంశీ, మొగిలి మనోహర్, ఎర్ర రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.