సీఎం సభకు ఏర్పాట్లు పూర్తి
రాష్ట్ర రైతులకు ఆర్థిక భరోసా కల్పించే “రైతు భరోసా” పథకం కింద సోమవారం రూ.5,563 కోట్లను విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించనున్న నేపథ్యంలో,కాటారం మండలం నస్తురుపల్లి గ్రామంలో నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. ఈ ఏర్పాట్లను రాష్ట్ర మంత్రులు, జిల్లా అధికారులు ఆదివారం సమగ్రంగా పరిశీలించారు.రాష్ట్ర వ్యవసాయ, సహకార, జౌళి,చేనేతల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ,రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.దేశంలోనే రైతులకు అత్యధికంగా ఆర్థిక సహాయం అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని పేర్కొన్నారు. ఇప్పటికే లక్షలాది మంది రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేసి వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తున్నామని వివరించారు.రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, రెండో విడత రైతు భరోసా నిధులను నస్తురుపల్లి వేదికగా సీఎం విడుదల చేయనున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం రైతులకు రుణమాఫీ, వ్యవసాయ పరికరాల పంపిణీ, సన్నవడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. రైతును ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.సభ అనంతరం సీఎం కాళేశ్వరం వెళ్లి కాళేశ్వరం ఆలయం లో స్వామి దర్శనం చేసుకోనున్నారు. ఆలయ అభివృద్ధికి రూ.200 కోట్లతో రూపొందించిన మాస్టర్ ప్లాన్‌కు భూమిపూజ, శిలాఫలకం ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం మేడిగడ్డ ప్రాజెక్టును కూడా సందర్శించనున్నారు.గత ప్రభుత్వ కాలంలో ప్రాజెక్టుల నిర్మాణంలో నాణ్యత లోపాల వల్ల ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని, ప్రస్తుత ప్రభుత్వం పారదర్శకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని మంత్రులు తెలిపారు. ప్రాజెక్టులను సమర్థవంతంగా వినియోగించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.రైతులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రులు పిలుపునిచ్చారు.