ఆర్టీసీని ప్రైవేటీకరణ నుంచి పరిరక్షించాలి-సిఐటియు
ఆర్టీసీని ప్రైవేటీకరణ నుంచి కాపాడాలని, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు రాపర్తి రాజు డిమాండ్ చేశారు.జనగాం బస్ డిపో వద్ద నిర్వహించిన ఆర్టీసీ కార్మికుల గేట్ మీటింగ్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 12న జరగనున్న సార్వత్రిక సమ్మెలో తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికులు సంపూర్ణ మద్దతు ప్రకటించి పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా రవాణా వ్యవస్థను నిలబెట్టే ఆర్టీసీ కార్మికులు ఎన్నో సంవత్సరాలుగా వేతనాలు, అలవెన్సులు, ఉద్యోగ భద్రత వంటి మౌలిక హక్కుల కోసం పోరాడుతున్నారని అన్నారు.జీతాల ఆలస్యం, డీఏ బకాయిలు, పెన్షన్–గ్రాట్యుటీ చెల్లింపుల నిర్లక్ష్యం, పని గంటల పెంపు, కాంట్రాక్ట్ విధానం విస్తరణ వంటి సమస్యలు కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను రక్షించాల్సిన ప్రభుత్వమే నాలుగు లేబర్ కోడ్స్ ద్వారా సమ్మె హక్కును నీరుగారుస్తూ, పని గంటలు పెంచడం, కార్మిక హక్కులను కాలరాయడం సిగ్గుచేటన్నారు.ఆర్టీసీ ప్రైవేటీకరణ ముప్పు ప్రజా ఆస్తులపై దాడిగా మారిందని, ఇది కేవలం కార్మికుల సమస్య మాత్రమే కాకుండా సామాన్య ప్రజల ప్రయోజనాలకు కూడా నష్టం చేకూర్చే అంశమని తెలిపారు. కార్మికుల హక్కుల రక్షణ, ప్రజా రవాణా భవిష్యత్తు కోసం కార్మిక వర్గమంతా ఐక్యంగా పోరాడాలని, ఫిబ్రవరి 12 సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ గేట్ మీటింగ్లో సిఐటియు యూనియన్ నాయకులు బిక్షపతి, పరిసరాములు, ఎం.రాజు, మహేందర్ రాజు, వెంకటరెడ్డి, దయాకర్ తదితరులు పాల్గొన్నారు