గడిపల్లి శివాలయంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు
గడిపల్లి శివాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రేగొండ మండలం గడిపల్లి గ్రామంలోని ప్రాచీన గడిపల్లి శివాలయంలో మహోత్సవాలు భక్తి ఉత్సాహాల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి.ఈ పవిత్ర సందర్భంగా భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.ఉదయం వేళల నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య రుద్రాభిషేకం, లింగార్చన, బిల్వార్చన, మహామంగళహారతి వంటి శైవ ఆరాధన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే స్వామివారికి పాలు, పన్నీరు, తేనె, గంగాజలం వంటి పవిత్ర ద్రవ్యాలతో అభిషేకం చేయించి, ఆలయ అర్చకుల నుంచి తీర్థప్రసాదాలు స్వీకరించారు.అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహా శివరాత్రి పర్వదినం భక్తి, నియమ నిష్ఠ, ఆధ్యాత్మిక చచేతన్యానికి ప్రతీక అని పేర్కొన్నారు. శివుని ఆరాధన ద్వారా మనసుకు శాంతి, కుటుంబాలకు సౌఖ్యం, సమాజానికి ఐక్యత కలుగుతాయని ఆయన అన్నారు.ప్రజలందరూ శివుని కృపాకటాక్షాలతో సుఖసంతోషాలతో, ఆరోగ్యంతో జీవించాలని ఆకాంక్షించారు. ఆలయ అభివృద్ధి, సౌకర్యాల విస్తరణకు తాను ఎల్లప్పుడూ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.మహోత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించగా,శివనామసంకీర్తనలతో పరిసరాలు మార్మోగాయి.గ్రామస్తులు,మహిళలు,యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో శివారాధన చేశారు.కార్యక్రమం ముగింపులో ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ పెద్దలు,భక్తులు విస్తృతంగా పాల్గొన్నారు.మహా శివరాత్రి వేడుకలు ప్రశాంతంగా,విజయవంతంగా జరిగేందుకు నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.