గళమెత్తిన ఉద్యోగులు,కార్మికులు
మండలంలో దేశవ్యాప్త సమ్మె సక్సెస్”
నల్ల చట్టాల రద్దే సమ్మె ఉద్దేశ్యం:చలమాల విఠల్ రావు(సీఐటీయూ రాష్ట్ర కమిటి సభ్యులు)
ఇది ఆరంభమే అంతం కాదు:మల్లూరు చంద్రశేఖర్(సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి)
ఖమ్మంజిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలoలో సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ,ఆశా ఉద్యోగులు,హమాలీ,బిల్డింగ్,గ్రామపంచాయతీ కార్మికులు గురువారం మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తూ గళమెత్తారు.
వేంసూరు లోని ఎర్ర రామయ్య భవనం నుండి మర్లపాడు గ్రామ వ్యాపార కూడలి వరకు మండుటెండను సైతం లెక్కచేయకుండా లేబర్ కోడ్లు,విద్యుత్ సంస్కరణలు,విత్తన చట్ట సంస్కరణలు రద్దు చేయాలని,మోడీ ప్రభుత్వం డౌన్ డౌన్,కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి,సీఐటీయూ జిందాబాద్ అని నినదిస్తూ భారీ ప్రదర్శన చేశారు.ఈ సందర్భంగా సీఐటీయూ మండల కో కన్వీనర్ వరకా సుశీల అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఐటీయూ రాష్ట్ర కమిటి సభ్యులు చలమాల విఠల్ రావు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ మోదీ సర్కారు తెచ్చిన కార్మిక,కర్షక,కూలీల వ్యతిరేక నల్లచట్టాలను రద్దు చేయాలని ఉద్దేశ్యంతో అఖిలభారత కార్మిక సంఘాలు,ఉద్యోగ ఫెడరేషన్ లు,కర్షక,వ్యవసాయ కార్మిక సంఘాలు గురువారం దేశ వ్యాప్తంగా సమ్మెను తలపెట్టాయన్నారు.సకల జనులకు ద్రోహం చేసి కార్పొరేట్లకు దోచి పెట్టడమే లక్ష్యంగా మోడీ ప్రభుత్వం పని చేస్తుందని,ప్రజల మధ్య మతం,కులం పేరుతో వైషమ్యాలు సృష్టిస్తూ ప్రజా ఐక్యతకు విఘాతం కలిగిస్తుందని దుయ్యబట్టారు.అనంతరం పాల్గొన్న సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మల్లూరు చంద్రశేఖర్ మాట్లాడుతూ గురువారం దేశ వ్యాప్తంగా జరిగిన సమ్మె మోదీ ప్రభుత్వ ఒంటెద్దు పోకడకు వ్యతిరేకంగా,దేశ రక్షణకు కంకణం కట్టుకున్న పోరాటాలకు ఆరంభం మాత్రమేనని అంతం కాదని స్పష్టం చేశారు.నల్ల చట్టాలు రద్దు చేసే వరకు,అసంఘటిత కార్మికులకు సంక్షేమ చట్టం ఏర్పాటు చేసే వరకు,అంగన్వాడీ,ఆశా,మధ్యాహ్న భోజన పథకం,ఐకెపి,104,108,గ్రామ పంచాయతీ తదితర శాశ్వత కాలం పనులలో పని చేసే ఉద్యోగులకు,కార్మికులకు,జర్నలిస్టులకు కనీస వేతనాలు,పి.ఎఫ్,ఈ ఎస్ఐ,వారసత్వ ఉద్యోగ అవకాశాలు,పెన్షన్,రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చే వరకు దశల వారీగా పోరాటాలు జరుగుతాయని,సుమారు 60 రోజుల ఏకకాలం సమ్మె కూడా దేశవ్యాప్తంగా నిర్వహించే దానికి సీఐటీయూ అఖిల భారత నాయకత్వం యోచిస్తుందని కార్మిక వర్గం సిద్ధంగా వుండాలని తెలిపారు.లేబర్ కోడ్లు రద్దు చేసి పాత కార్మిక చట్టాలను యధాతథంగా అమలు చేస్తేనే దేశంలో శ్రామికవర్గంతో కూడిన అభివృద్ధి జరుగుతుందని,దేశ జిడిపి పెరుగుదలకు దోహదం జరుగుతుందని మల్లూరు తెలిపారు.అనంతరం తెలంగాణ రైతు సంఘం మండల కార్యదర్శి అర్వపల్లి గోపాలరావు మాట్లాడుతూ రైతాంగాన్ని దోచుకోవడానికి విత్తన సవరణ చట్టం తెచ్చిన మోడీ ప్రభుత్వం అన్నదాతల ఆగ్రహానికి గురి గాక తప్పదని తెలిపారు.ప్రజా నాట్యమండలి నాయకులు కండె సత్యం మోదీ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలపై పాట పాడారు.ఈ కార్యక్రమంలో: రైతు సంఘం నాయకులు మోరంపూడి వెంకటేశ్వరరావు,అంగన్వాడీ యూనియన్ మండల అధ్యక్షురాలు జీవమ్మ,పుష్ప,శాంతామణి,లక్ష్మి,పద్మజ,పద్మ,రత్నకుమారి, లలిత,కళావతి,ఎలిజబెత్,స్వర్ణ,ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు స్వాతి,అరుణ,పుల్లమ్మ,చిన్నమ్మాయి,రాజేశ్వరి,పద్మ,హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు అప్పారావు,సత్యం,పూరేటి సుగుణరావు,ఆగర్ల సంఘం నాయకులు తుంగా శేషయ్య,గ్రామ పంచాయతీ యూనియన్ నాయకులు సుధాకర్,భాస్కర్ లతో పాటు మూడొందల మంది పాల్గొన్నారు