ఘనంగా నవ సమాజ స్థాపకుడు సద్గురు సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి
లాంబాడీ గిరిజనుల ఆరాధ్యదైవం, నవ సమాజ స్థాపకుడు సేవాలాల్ మహారాజ్ 287వ జయంతిని పురస్కరించుకుని జనగామ జిల్లా కేంద్రంలోని బంజారా సీనియర్ నాయకులు మూడ్ లక్ష్మణ్ నాయక్, డాక్టర్ శంకర్ నాయక్ స్వగృహంలో పెద్ద తండా ఎం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో బోగ్ బండారో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా టీపీసీసీ సభ్యులు, బంజారా ముద్దుబిడ్డ డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, మూడ్ లక్ష్మణ్ నాయక్, డాక్టర్ శంకర్ నాయక్, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి భూక్య చందు నాయక్, భూక్య వాసు నాయక్ మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ జీవితం, ఆశయాలు, సేవలను స్మరించుకున్నారు.అనంతపురం జిల్లా గుత్తి మండలం రాంజీ నాయక్ తండాలో భీమా నాయక్, ధార్మినిబాయి దంపతులకు జన్మించిన ఆయన చిన్ననాటి నుంచే సేవామార్గాన్ని అవలంబించారని తెలిపారు.గోర్ సమాజ్గా పిలువబడే బంజారా, లాంబాడీ సమాజాల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తిగా ఆయన నిలిచారని కొనియాడారు. సుమారు 287 సంవత్సరాల క్రితమే నవ సమాజ నిర్మాణం కోసం, గిరిజన తండాల అభివృద్ధి కోసం సంచార జీవనాన్ని విడిచిపెట్టి స్థిర నివాసాలు ఏర్పరుచుకోవాలని పిలుపునిచ్చారని వివరించారు. గోర్ బొలి భాష అభివృద్ధి, లాంబాడీ సంస్కృతి పరిరక్షణకు మార్గదర్శకత్వం వహించి తన జాతిని మేల్కొల్పిన మహనీయుడని పేర్కొన్నారు.తండాల్లో “మన రాజ్యం మనమే పాలించాలి” అనే స్వయంపాలన స్ఫూర్తిని నూరిపోశారని గుర్తుచేస్తూ, తన జాతి హక్కులను కాపాడుకోవడం కోసం నిరంతరం పోరాటం చేయాలని ఆయన ఇచ్చిన పిలుపు నేటికీ ప్రాసంగికమని అన్నారు.అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా సేవాలాల్ మహారాజ్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 15న అధికారికంగా నిర్వహిస్తున్నప్పటికీ ప్రతి సంవత్సరం క్యాజువల్ సెలవుకే పరిమితం చేయడం గిరిజనులను నిరుత్సాహపరుస్తోందని అభిప్రాయపడ్డారు.జయంతి రోజున అధికారిక సెలవుదినంగా ప్రకటించాలని, లేకపోతే కనీసం గిరిజన ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు ఆన్‌డ్యూటీ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని 60 గిరిజన తండా గ్రామపంచాయతీల్లో అధికారికంగా జయంతి నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తగిన చర్యల ద్వారా నిరూపించుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో బానోతు హరిలాల్, లకావత్ నరేష్ నాయక్, ధరావత్ నాగేందర్, ధరావత్ కీమా, ధరావత్ సొమ్ల, భూక్యా శివరామ్, కిషన్ దేవ్, భూక్య రఘు, దసృ నాయక్, రామావత్ మీట్యా నాయక్, భూక్యా సావిత్రి, భూక్యా జ్యోతి తదితర బంజారా నాయకులు పాల్గొన్నారు.పెద్ద తండా గ్రామపంచాయతీ 7వ వార్డు మెంబర్ భూక్య రజిత రాజు నాయక్, 3వ వార్డు మెంబర్ దండు రాజు ముదిరాజ్, మాజీ ఉపసర్పంచ్ గుగులోతు కవిత వాలు నాయక్, ప్రభాకర్ నాయక్, భూక్య తిరుపతి, రాజేష్, విజయ్ కాంత్, రజినీకాంత్, గూగులోతు ప్రవీణ్, లచ్చినారి, భూక్యా విజయ్, గుగులోతు శ్రీకాంత్, గణేష్, బాలరాజు తదితరులు హాజరయ్యారు.