చేనేత కార్మికుల ఉపాధిని దెబ్బతీయొద్దు
రాష్ట్రంలో చేనేత కార్మికుల ఉపాధిపై ప్రభావం చూపే విధంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను పునరాలోచించాలని రాష్ట్ర చేనేత ఐక్య వేదిక మీడియా కార్యదర్శి లింగమూర్తి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం వరంగల్ జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా లింగమూర్తి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం విద్యార్థుల యూనిఫామ్ తయారీ కోసం టెస్కో (తెలంగాణ చేనేత సహకార సంఘం)కు ప్రభుత్వం ఇస్తున్న ఆర్డర్లను ఈసారి రద్దు చేయడం చేనేత కార్మికుల జీవనాధారాన్ని దెబ్బతీయడమేనని పేర్కొన్నారు. ముఖ్యంగా 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన రూ.105.54 కోట్ల యూనిఫామ్ టెండర్‌ను రద్దు చేయడం వల్ల వేలాది మంది చేనేత కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.దశాబ్దాలుగా విద్యాశాఖ, సంక్షేమ శాఖల పరిధిలోని విద్యార్థులకు దుస్తులు తయారు చేసే బాధ్యతను చేనేత సహకార సంఘాలు నిర్వహిస్తూ వస్తున్నాయని గుర్తుచేశారు.అయితే ఈసారి ప్రభుత్వం ఆర్డర్లను ఇవ్వకపోవడం వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.సాధారణంగా ప్రతి సంవత్సరం జనవరి నెలలో వచ్చే ఆర్డర్లు ఈసారి ఏప్రిల్ నాటికీ రాకపోవడంతో కార్మికులు ఆదాయం కోల్పోతున్నారని చెప్పారు.ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 393 చేనేత సహకార సంఘాల్లో పని కొరత తీవ్రంగా ఉందని,ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఆర్డర్లను కూడా నిలిపివేయడం అనేది కార్మికులపై మరింత భారాన్ని మోపుతున్నదని విమర్శించారు.విద్యార్థుల యూనిఫామ్ తయారీ పనులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ఆలోచనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి వచ్చే ఆర్డర్లను మళ్లీ చేనేత సహకార సంఘాలకు అప్పగించి, వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచేందుకు చర్యలు తీసుకోవాలని లింగమూర్తి కోరారు. చేనేత రంగాన్ని రక్షించడం ద్వారా వేలాది కుటుంబాల జీవనోపాధి కాపాడవచ్చని ఆయన పేర్కొన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించి టెస్కోకు ఆర్డర్లు కేటాయించేలా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర చేనేత ఐక్య వేదిక తరఫున విజ్ఞప్తి చేశారు.