జర్నలిస్టుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) జిల్లా కమిటీ సమావేశంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారంపై కీలక చర్చ జరిగింది.జిల్లా అధ్యక్షుడు ఎర్రం సతీష్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి బి.దయాసాగర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా దయాసాగర్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు జీతభత్యాలు లేకుండా, 24 గంటలు నిరంతరం పనిచేస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.అయినప్పటికీ జర్నలిస్టులు ఆర్థికంగా ఎదగలేకపోతున్నారని,ఆరోగ్య భద్రత లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.జర్నలిస్టులు మరణించినప్పుడు వారి కుటుంబాలకు మీడియా అకాడమీ నుంచి కేవలం రూ.1 లక్ష మాత్రమే అందజేస్తున్నారని, దీనిని రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే మృత జర్నలిస్టు భార్యకు ప్రస్తుతం ఇస్తున్న రూ.3 వేల పింఛన్‌ను రూ.5 వేలుగా పెంచాలని కోరారు. ప్రభుత్వాలు జారీ చేసిన హెల్త్ కార్డులు సరిగా పనిచేయడం లేదని, పని ఒత్తిడి కారణంగా జర్నలిస్టులు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు.జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు, ఇండ్ల స్థలాలు, గృహాలు, హెల్త్ కార్డులు, రిటైర్డ్ జర్నలిస్టులకు పింఛన్లు, మహిళా జర్నలిస్టులకు రాత్రి సమయంలో రవాణా సౌకర్యం వంటి సమస్యలు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయని, వీటి పరిష్కారానికి టిడబ్ల్యూజేఎఫ్ నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు, కలెక్టర్ల దృష్టికి ఈ సమస్యలను తీసుకెళ్తూ వినతిపత్రాలు సమర్పిస్తున్నామని తెలిపారు.భూపాలపల్లి జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఫీజు రాయితీలు ఇవ్వడం లేదని, అలాంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.జిల్లా కమిటీ సభ్యులు యూనియన్ నియమ నిబంధనలకు లోబడి బాధ్యతతో పని చేయాలని, స్థానిక జర్నలిస్టుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. సమిష్టిగా పనిచేస్తూ హక్కుల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా టిడబ్ల్యూజేఎఫ్ 2026 నూతన డైరీని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గుజ్జ సారేశ్వరరావు, జాతీయ కౌన్సిల్ సభ్యులు కొలుగూరి సంజీవరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చింతల కుమార్ యాదవ్, గాదె రమేష్, రొంటాల శంకర్, జిల్లా ఉపాధ్యక్షులు ములకల లక్ష్మారెడ్డి, కోశాధికారి మండల రాంబాబు, జాయింట్ సెక్రటరీ టి. దుర్గయ్య, సలహాదారు రమేష్, తెలంగాణ బ్రాడ్కాస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఆకుతోట ప్రవీణ్ కుమార్, కార్యదర్శి కమలాకర్, కోశాధికారి భాస్కర్, మీడియా కన్వీనర్ పుల్ల సృజన్, జిల్లా కమిటీ సభ్యులు రమేష్, రహీం పాషా, గోవర్ధన్, తోట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు