జూలై 13న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం
జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 13న జయశంకర్ భూపాలపల్లి జిల్లావ్యాప్తంగా పగడ్బందీగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ తెలిపారు.శనివారం ఆయన జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ,జిల్లాలోని 1 నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు వేయడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.జిల్లాలో ఈ వయసు కలిగిన పిల్లలు మొత్తం 70,773 మంది ఉండగా,వీరందరికీ సరిపడేలా ఆల్బెండజోల్ మాత్రలను అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఇప్పటికే పంపిణీ చేసి సిద్ధంగా ఉంచామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని వైద్య సిబ్బందికి తగిన శిక్షణ పూర్తి చేశామని, స్కూళ్లు, కాలేజీల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని వివరించారు.ఈనెల 13వ తేదీన మాత్రలు వేసుకోలేకపోయిన పిల్లల కోసం ప్రత్యేకంగా జూలై 20వ తేదీన ‘మాపప్’ కార్యక్రమాన్ని నిర్వహించి,మిగిలిపోయిన వారందరికీ మాత్రలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.ఇందుకోసం వైద్య ఆరోగ్య సిబ్బందితో పాటు అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, పాఠశాల యాజమాన్యాలు సమన్వయంతో పనిచేస్తున్నారని, 13న ఉదయం పాఠశాలల్లో ప్రార్థన సమయం ముగిసిన వెంటనే విద్యార్థులకు చేతుల పరిశుభ్రతపై అవగాహన కల్పించి మాత్రలు పంపిణీ చేయాలని సూచించారు.ఆల్బెండజోల్ మాత్రలు కడుపులోని నులిపురుగులను సమర్థవంతంగా నిర్మూలించి పిల్లల్లో శారీరక,మానసిక ఎదుగుదలకు దోహదపడతాయని డాక్టర్ మధుసూదన్ వివరించారు.కడుపులో నులిపురుగులు ఉండటం వల్ల పిల్లల్లో పోషకాహార లోపం,రక్తహీనత, అలసట, ఆకలి లేకపోవడం, కడుపునొప్పి, వికారం, బరువు తగ్గడం వంటి సమస్యలు వస్తాయని, మాత్రల ద్వారా వీటిని నివారించి వారు చదువుల్లో, ఆటపాటల్లో చురుగ్గా ఉండేలా చేయవచ్చన్నారు.ఈ మాత్రల వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని, అయినప్పటికీ ముందుజాగ్రత్తగా నిపుణులైన పిల్లల వైద్యుల సేవలను అందుబాటులో ఉంచుతున్నామని భరోసా ఇచ్చారు.నులిపురుగుల నివారణతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో ముఖ్యమని,పిల్లల గోర్లు ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలని,శుభ్రమైన నీటిని తాగాలని, ఆహార పదార్థాలపై మూతలు పెట్టాలని,పండ్లు, కూరగాయలను కడిగి వాడాలని సూచించారు.అలాగే బహిరంగ మలవిసర్జన చేయకుండా తప్పనిసరిగా మరుగుదొడ్లను ఉపయోగించాలని, పాదరక్షలు ధరించాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.ఈ బృహత్తర కార్యక్రమం కోసం జిల్లాలోని 423 ప్రభుత్వ పాఠశాలలు, 69 ప్రైవేట్ పాఠశాలలు, 32 జూనియర్ కళాశాలలు, 64 అంగన్‌వాడీ కేంద్రాలతో పాటు ఒకేషనల్ కాలేజీలు, అనాథ ఆశ్రమాల పరిధిలోని పిల్లలందరినీ కలుపుకుంటూ పక్కా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామని డీఎంహెచ్‌ఓ తెలిపారు.వయసు పరిమితిని బట్టి మాత్రల పంపిణీకి నిబంధనలు ఖరారు చేశామని,400 ఎంజీ సామర్థ్యం గల ఈ ఆల్బెండజోల్ మాత్రలను 1 నుండి 2 సంవత్సరాల పిల్లలకు సగం మాత్రను పొడి (క్రష్) చేసి ఇవ్వాలని, 2 నుండి 3 సంవత్సరాల పిల్లలకు ఒక పూర్తి మాత్రను పొడి చేసి తినిపించాలని,అలాగే 4 నుండి 19 సంవత్సరాల లోపు పిల్లలకు ఒక పూర్తి మాత్రను నోట్లో వేసి చప్పరించమని చెప్పాలని స్పష్టం చేశారు.తమ పిల్లలను నులిపురుగుల బారి నుండి రక్షించుకునేందుకు ఈనెల 13న, అలాగే మిగిలిపోయిన వారికి 20న జరిగే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.జిల్లా యంత్రాంగం,మీడియా ప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల నిర్వాహకులు,తల్లిదండ్రులు అందరూ సహకరించి ఈ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని వంద శాతం విజయవంతం చేయాలని డాక్టర్ మధుసూదన్ పిలుపునిచ్చారు.