మార్చి 2027 నాటికి రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో భూ రీ-సర్వే పూర్తి
రాష్ట్రంలో భూ భారతి చట్టం సమర్థవంతంగా అమలు కావాలంటే రాష్ట్రవ్యాప్తంగా భూ రీ-సర్వే ప్రక్రియను అత్యంత ప్రాధాన్యతతో నిర్వహించాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఖమ్మం ఐడిఓసి కార్యాలయం నుండి భూ రీ-సర్వే, భూ భారతి,సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం, ఇందిరమ్మ ఇండ్లు,డబుల్ బెడ్రూమ్ (2బీహెచ్‌కే) ఇళ్ల పంపిణీ,పాఠశాల విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ తదితర కీలక అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో హైదరాబాద్ నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సెక్రటరీ రాజీవ్ గాంధీ హనుమంతు, గృహనిర్మాణ శాఖ డైరెక్టర్ వి.పి. గౌతమ్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధరణిని రద్దు చేసి భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చామని, రైతుల భూములకు పూర్తి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. భూ భారతి అమల్లోకి వచ్చి 15 నెలలు పూర్తయినా ప్రజల అంచనాలకు పూర్తిస్థాయిలో చేరలేకపోయామని అంగీకరించిన మంత్రి, ధరణి కాలంలో పెండింగ్‌లో ఉన్న 9.26 లక్షల సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం కోసం భూ భారతిలో అవకాశం కల్పించి, హైకోర్టు సమస్యను కూడా పరిష్కరించినప్పటికీ ఇంకా అధిక సంఖ్యలో దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయనే అభిప్రాయం ప్రజల్లో ఉందని,తక్షణమే తిరస్కరణలకు గల కారణాలను గుర్తించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.భూ భారతి చట్టం సమర్థవంతంగా అమలు కావాలంటే భూ రీ-సర్వే తప్పనిసరి అని మేధావులు సూచించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. ఇందుకోసం శిక్షణ పొందిన లైసెన్స్డ్ సర్వేయర్ల సేవలను వినియోగించుకోవాలని, రెగ్యులర్ సర్వేయర్లు, లైసెన్స్డ్ సర్వేయర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అయితే లైసెన్స్డ్ సర్వేయర్లకు ఉద్యోగం లేదా రెగ్యులరైజేషన్ హామీ ఏదీ ఇవ్వలేదని స్పష్టం చేస్తూనే, వారికి బీమా, సామాజిక భద్రత కల్పించే చర్యలు తీసుకుంటామన్నారు. పైలట్ ప్రాజెక్టుగా నక్షాలు లేని 413 ప్రాంతాల్లోని ఐదు గ్రామాల్లో నిర్వహించిన రీ-సర్వేతో 95 శాతం వరకు భూ సమస్యలు పరిష్కారమయ్యాయని, నిన్ననే ముఖ్యమంత్రి ములుగుమాడు గ్రామ రైతులకు కొత్త పట్టాదారు పాస్‌బుక్‌లు పంపిణీ చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం తొలి విడతలో ప్రతి జిల్లాలో 70 గ్రామాలను ఎంపిక చేసి రీ-సర్వే చేపట్టినట్లు వివరించారు.రీ-సర్వేకు అవసరమైన అత్యుత్తమ నాణ్యత గల పరికరాలను రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని కొనుగోలు చేయాలని, కలెక్టర్లు దీనిని అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకుని అవసరమైన సిబ్బంది, మౌలిక వసతులు సమకూర్చాలని ఆదేశించారు. ప్రతి నెల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పురోగతిని సమీక్షిస్తామని, మార్చి-2027 నాటికి మూడు విడతల్లో రీ-సర్వే పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందులో పనిచేసే లైసెన్స్డ్ సర్వేయర్లకు ఎకరానికి రూ.50తో పాటు రవాణా, ఇతర ఖర్చుల కోసం మరో రూ.10 కలిపి మొత్తం రూ.60 అందజేస్తామని, చెల్లింపులు వెంటనే జరిగేలా చర్యలు ఉంటాయన్నారు.విధుల్లో చేరని లైసెన్స్డ్ సర్వేయర్లకు గడువిచ్చి, గడువులోగా చేరని వారి లైసెన్సులు రద్దు చేయాలని ఆదేశించారు.ఒక సర్వే నంబరులో కొంత భూమి మాత్రమే ప్రభుత్వ అవసరాలకు సేకరించినప్పటికీ మొత్తం భూమిని నిషేధిత జాబితాలో ఉంచడం వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని, సాదాబైనామా దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిష్కరించి నోటీసులు త్వరితగతిన జారీ చేయాలని సూచించారు.పాలేరు నియోజకవర్గ ప్రజాదర్బార్‌లో వచ్చిన 6,500 రెవెన్యూ సమస్యల్లో 98 శాతం సమస్యలకు భూ రీ-సర్వేతో శాశ్వత పరిష్కారం లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.ఇక గృహ నిర్మాణ రంగంపై మంత్రి మాట్లాడుతూ, మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని, పెండింగ్‌లో ఉన్న 2బీహెచ్‌కే ఇళ్లను ప్రస్తుత స్థితిలోనే లబ్ధిదారులకు అందజేసి, మిగిలిన పనులకు నిధులు విడుదల చేయాలని ఆదేశించారు. నిధులు విడుదలైనా పనులు చేపట్టని చోట్ల బాధ్యులైన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను వెంటనే పూర్తి చేసి గుడిసెల్లో నివసించే కుటుంబాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, మొదటి విడతలో మంజూరు కాని అర్హుల ఇళ్లను కూడా రెండవ విడతలో చేర్చి మంజూరు చేయాలని సూచించారు. ఇసుక, కంకర సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఈ క్రమంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్ మాట్లాడుతూ, తొలి విడతలో ఎంపిక చేసిన 70 గ్రామాల్లో భూ రీ-సర్వేను నవంబర్ లోపు, రెండవ విడతలో మరో 70 గ్రామాల్లో మార్చి-2027లోపు పూర్తి చేయాలని, రీ-సర్వే పూర్తయితే సాదాబైనామా దరఖాస్తుల తిరస్కరణలు గణనీయంగా తగ్గుతాయని తెలిపారు. హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో గుడిసెలను గుర్తించిన వాటిలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసే ప్రక్రియ కొనసాగుతోందని, మొదటి విడత నిర్మాణాలను వేగంగా పూర్తి చేసి ఆగస్టు నాటికి రెండు లక్షల ఇళ్ల లక్ష్యాన్ని చేరుకోవాలని,పెండింగ్‌లో ఉన్న 2బీహెచ్‌కే ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు అప్పగించాలని సూచించారు.అనంతరం పాఠశాల విద్యార్థుల యూనిఫాంల సరఫరాపై సెర్ప్ సీఈవో దివ్య మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల విద్యార్థుల యూనిఫాంలన్నీ స్వయం సహాయక సంఘాల మహిళా టైలర్ల ద్వారానే కుట్టిస్తున్నామని తెలిపారు.టెండర్ ఆలస్యంతో వస్త్రం ఆలస్యంగా వచ్చినప్పటికీ జూలై 15లోపు రెసిడెన్షియల్ బాలికలకు, జూలై 30లోపు బాలురకు యూనిఫాంలు అందించాలని, ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి కనీసం ఒక జత యూనిఫాం అందేలా కలెక్టర్లు, డీఆర్‌డీఏ, గురుకులాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ గ్రామాల మధ్య సరిహద్దు సమస్యలపై ప్రత్యేక సమన్వయంతో ముందుకు సాగుతున్నామని, భూ రీ-సర్వేను నిర్ణీత సమయంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈ కీలక వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, భూపాలపల్లి, కాటారం ఆర్డిఓలు హరికృష్ణ, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.