తెలంగాణ ప్రగతికి కేసీఆర్ చిరునామా
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం (జూన్ 2) సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు,తెలంగాణ బిడ్డలందరికీ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోనే రాష్ట్రం సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర సాధన పోరాటంలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నివాళులు అర్పించాలని పిలుపునిచ్చారు.ప్రగతి పథంలో తెలంగాణ: దశాబ్దాల పాటు సాగిన అణచివేతపై పోరాడి, అనేక ఆటుపోట్లను అధిగమించి శాంతియుత, ప్రజాస్వామ్య పంథాలో స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. ఉమ్మడి పాలనలో తీవ్ర వివక్షకు గురైన తెలంగాణను స్వయం పాలనలో దేశానికి దిక్సూచిగా మార్చామని, ‘పరిపాలన చేతకాదు’ అని విమర్శించిన వారి నోళ్లు మూతపడేలా కేసీఆర్ ప్రగతి పాలన అందించారని అన్నారు.నూతన రాష్ట్రంగా ఏర్పడిన పదేండ్లలోనే సకల జనుల సంక్షేమం, సమస్త రంగాల సమగ్ర ప్రగతిని సాధించి తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దామని వివరించారు. సాగునీరు, తాగునీరు, విద్యుత్, వ్యవసాయం, విద్య, వైద్యం, సంక్షేమ రంగాల్లో తెలంగాణ సాధించిన ప్రగతి యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఒకనాడు ఎడారిలా మారిన తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా మార్చి, అన్నపూర్ణగా తీర్చిదిద్దిన ఘనత పదేండ్ల కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.అప్రమత్తంగా ఉండాలి: ప్రగతికి చిరునామాగా మారిన తెలంగాణ అస్తిత్వం తిరిగి మరోసారి ప్రమాదంలో పడకుండా అప్రమత్తంగా ఉండాలని ఎర్రబెల్లి హెచ్చరించారు. విపత్కర శక్తుల నుంచి తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ తెలంగాణకు రక్షణ కవచంగా కేసీఆర్ నిలుస్తారని పునరుద్ఘాటించారు.స్వరాష్ట్ర సాధనలో, పదేండ్ల పునర్నిర్మాణంలో చూపిన స్ఫూర్తిని నిరంతరం కొనసాగించాలని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని చిత్తశుద్ధితో అమలు చేసి వారిలో విశ్వాసం నింపాల్సిన బాధ్యత ప్రస్తుత పాలకులపై ఉందని తెలిపారు. రైతాంగం, శ్రమజీవులు, సబ్బండ వర్గాల జీవితాలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండాలని ఆకాంక్షించారు