నైపుణ్యాలకు గుర్తింపు
నిర్మాణ కార్మికుల నైపుణ్యాలను గుర్తించి, వారికి విదేశీ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలోని భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి కీలక చర్యలు చేపట్టింది. ఈ మేరకు జిల్లా స్థాయిలో గుర్తింపు ప్రక్రియ ప్రారంభమైంది.
నమోదైన నిర్మాణ కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడం లక్ష్యంగా రెండు ప్రధాన కార్యక్రమాలను అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
మొదటి కార్యక్రమంగా మేస్త్రీ, ఇనుప కడ్డీలు వంచే పని, విద్యుత్, వెల్డింగ్ వంటి నిర్మాణ రంగ వృత్తుల్లో అనుభవం కలిగిన కార్మికులను గుర్తించి, వారికి “మునుపటి అభ్యాస గుర్తింపు” విధానంలో అధికారిక నైపుణ్య ధ్రువపత్రాలు అందించనున్నారు. ఈ ధ్రువపత్రాల ఆధారంగా అర్హులైన వారికి విదేశాలలో మంచి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళిక రూపొందించారు.
ఇక రెండవ కార్యక్రమంలో భాగంగా నిర్మాణ కార్మికుల పిల్లలు లేదా ఆధారితులను కూడా గుర్తించనున్నారు. 18 నుంచి 30 సంవత్సరాల వయస్సు గల, కనీసం 8వ తరగతి విద్యార్హత ఉన్న వారికి భాషా శిక్షణతో పాటు సాఫ్ట్ నైపుణ్యాలలో శిక్షణ ఇచ్చి విదేశీ ఉపాధికి సిద్ధం చేయనున్నారు.
ఈ రెండు వర్గాలకు చెందిన అభ్యర్థుల వివరాలు—పేరు, ఆధార్ సంఖ్య, మొబైల్ నంబర్, వృత్తి లేదా విద్య, విదేశీ ఉపాధిపై ఆసక్తి వంటి అంశాలతో జిల్లా వారీగా సమాచారాన్ని సేకరించి సంక్షేమ మండలికి సమర్పించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
ఈ కార్యక్రమం ద్వారా నిర్మాణ కార్మికులకు మెరుగైన జీవనోపాధి, సురక్షిత వలస, కుటుంబ సంక్షేమం సాధ్యమవుతుందని కార్మిక శాఖ ప్రత్యేక కమిషనర్ శ్రీమతి పమేలా సత్పతి తెలిపారు. అర్హులైన కార్మికులు, వారి పిల్లలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని వెంటనే నమోదు చేసుకోవాలని ఆమె కోరారనీ ఓ ప్రకటనలో ఖమ్మం జిల్లా ఉప కార్మికాధికారి విజయ్ భాస్కర్ రెడ్డి మీడియాకు తెలిపారు.